Sunday, May 18, 2025

గురుకులాల్లో 5వ తరగతి సీట్ల భర్తీలో సరి కొత్త రికార్డు

- Advertisement -
- Advertisement -

ఎప్పుడూ లేని విధంగా మే 17 లోగా సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తి
గురుకుల కార్యదర్శి డా.విఎస్ అలగు వర్షిణి

మన తెలంగాణ / హైదరాబాద్ : గురుకులాల్లో 5వ తరగతి సీట్ల భర్తీలో సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల (Gurukul schools )సంస్థ సరికొత్త రికార్డు నెలకొల్పింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా మే 17లో సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో 2025- 26 విద్యా సంవత్సరానికి గాను (సాంఘీక సంక్షేమ, గిరిజన, బిసి గురుకులాలు, ప్రభుత్వ గురుకలాలు) నాలుగు సొసైటీలలో 5 వ తరగతి సీట్ల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 23న టిజిసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించబడింది. ఈ పరీక్షలో నాలుగు సొసైటీల వారిగా సీట్లను మూడు దఫాలుగా భర్తీ చేసి అర్హత పొందిన విద్యార్థుల మెరిట్ జాబితాను ఇది వరకు విడుదల చేశారు.

శనివారం విడుదల చేసిన 1822 సీట్లతో ఈ విద్యా సంవత్సరానికి గాను 5 వ తరగతి సీట్లు పూర్తిగా నింపడం జరిగింది. మే 3వ వారం లోపు 5 వ తరగతి సీట్లను పూర్తిగా భర్తీ చేయడం గురుకుల చరిత్రలో ఇదే మొదటి సారి కావడం విశేషమని ఇదొక గొప్ప రికార్డు అని టిజి సెట్ 2025 చీఫ్ కన్వీనర్ డా.వి.ఎస్.అలగు వర్షిణి వెల్లడించారు. విద్యార్థిని , విద్యార్థులు ఐదవ తరగతి లో చేరిన తర్వాత వారు ఏవైనా కారణాలతో సంబంధిత విద్యా సంస్థ లో కొనసాగకుండా వెళ్ళిపోతే వారి స్థానంలో ఏర్పడిన ఖాళీలను మే 25 తర్వాత తదుపరి మెరిట్ ఉన్న విద్యార్థులచేత భర్తీ చేయనున్నట్టు ఆమె పేర్కొన్నారు.

ఎప్పుడూ లేనివిధంగా గురుకుల (Gurukul schools ) విద్యాసంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరానికి దరఖాస్తులు అంచనాలకు మించి వచ్చాయని, దీనికి కారణం గురుకులాల్లో, ఇంటర్ లో తీసుకున్న విప్లవాత్మక మార్పులతో విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం, ఉత్తీర్ణశాతం గణనీయంగా పెరిగిగడమేనన్నారు. ఐఐటి, జెఈఈ వంటి పోటీ పరీక్షలు కూడా గురుకుల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలకు దీటుగా అధిక సంఖ్యలో అర్హతను సాధించారు. ఇంటర్ లో అడ్మిషన్ కు అర్హత పొందిన విద్యార్థుల జాబితాను ఈ నెల 23 లోగా వెల్లడించనున్నారని గురుకుల కార్యదర్శి తెలిపారు.

రుక్మాపూర్ సైనిక్ స్కూల్ ఫలితాలు విడుదల

తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విదాయలయాల సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ సైనిక పాఠశాలలో 6 వ తరగతి ప్రవేశాల కోసం ఈ సంవత్సరం ఫిబ్రవరి 23 న పరీక్షను నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో అర్హత పొందిన విద్యార్థులలో రుక్మా పూర్ సైనిక్ స్కూల్ లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను 1:10 చొప్పున ఎంపిక చేసి ఫిజికల్, మెడికల్ టెస్ట్ నిర్వహించినట్లు తెలిపారు. .ఈ టెస్టులో మొత్తం 80 సీట్లకు గాను 102 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారని, ఇలా క్వాలిఫై అయిన విద్యార్థుల ఫలితాలను కూడా శనివారం విడుదల చేసినట్లు తెలిపారు.

మల్కాజ్ గిరి ఫైన్ ఆర్ట్స్ ఫలితాలు విడుదల

మేడ్చెల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని ఘట్కేసర్ ఏదులాబాద్ ఫైన్ ఆర్ట్స్ పాఠశాలలో 6 వ తరగతి ప్రవేశాల కోసం ఫిబ్రవరి 23 న నిర్వహించిన పరీక్షలో అర్హత పొందిన విద్యార్థుల్లో ఫైన్ ఆర్ట్స్ స్కూల్ లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను 1:10 చొప్పున ఎంపిక చేసి స్కిల్ టెస్ట్ ఈ నెల రెండవ వారంలో నిర్వహించారు. ఇందులో మొత్తం 210 మంది విద్యార్థులు స్కిల్ టెస్ట్ కు హాజరు కాగా క్వాలిఫై అయిన 85 మంది విద్యార్థుల ఫలితాలను శనివారం విడుదల చేసినట్లు అలుగు వర్షిణి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News