కొనసాగుతున్న ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
ఈసారి మూడు కొత్త యూనివర్సిటీ
కాలేజీల్లో అందుబాటులోకి 720 కొత్త సీట్లు
వెబ్ ఆప్షన్లు ప్రక్రియ ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 171 ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తం 1,07,218 సీట్లు కన్వీనర్ కోటాలో 76,795 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయని సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. ఈసారి మూడు కొత్త యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలల్లో అదనపు సీట్లు అందుబాటులోకి వచ్చాయి. పాలమూరు యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో కొత్తగా 180 సీట్లు అందుబాటులోకి రాగా, శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో 240 సీట్లు, ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ తెలంగాణ కాలేజీలో 300 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.
ఈ విద్యాసంవత్సరం 21 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో 5808 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 9 జెఎన్‌టియుహెచ్ కాలేజీల్లో 3210 సీట్లు అందుబాటులో ఉండగా, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని రెండు కాలేజీల్లో 630 సీట్లు, 2 కెయు ఇంజనీరింగ్ కాలేజీల్లో 780 సీట్లు, ఒక మహాత్మాగాంధీ వర్సిటీ కాలేజీలో 240 సీట్లు, ఒక జెఎన్‌ఎఎఫ్‌ఎయు కాలేజీలో 160,2 ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కాలేజీలో 45, పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీకి చెందిన ఒక కాలేజీలో 23 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 23 యూనివర్సిటీ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలలో 7608 ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయని సాంకేతిక విద్యాశాఖ తెలిపింది. రెండు ప్రైవేటు వర్సిటీల్లో 1800 సీట్లు అందుబాటులో ఉండగా, కన్వీనర్ కోటా కింద 1260 సీట్లు ఉన్నాయని వెల్లడించింది.
అత్యధిక సీట్లు సిఎస్‌ఇలోనే
బి.టెక్ కోర్సులలో అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్(సిఎస్‌ఇ)లో 26,150 సీట్లు అందుబాటులో ఉండగా, సిఎస్‌ఇ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్)లో 12,495 సీట్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్(ఇసిఇ)లో 10,125 సీట్లు ఉన్నట్లు సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. అలాగే సిఎస్‌ఇ(డాటా సైన్స్)లో 6996 సీట్లు, సిఎస్‌ఇ(సైబర్ సెక్యూరిటీ)లో 1439 సీట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్‌లో 1235 సీట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో 858 సీట్లు, సిఎస్‌ఇ(సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ)లో 168 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.
సివిల్‌లో 3129, మెకానికల్‌లో 2994 సీట్లు
ఇంజనీరింగ్ సీట్లలో ఈ విద్యాసంవత్సరం సంప్రదాయ బ్రాంచీలైన సివిల్ ఇంజనీరింగ్‌లో 3129 సీట్లు అందుబాటులో ఉండగా, మెకానికల్ ఇంజనీరింగ్‌లో 2994 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 3681, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో 4301 సీట్లు అందుబాటులో ఉన్నట్లు సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది.
జెఎన్‌టియుహెచ్‌లో 3210
రాష్ట్రంలో 21 యూనివర్సిటీ కాలేజీల్లో 5808 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా, అందులో అత్యధికంగా జెఎన్‌టియుహెచ్‌లోని తొమ్మిది కాలేజీల్లో 3210 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీలోని మూడు కాలేజీల్లో 780 సీట్లు అందుబాటులో ఉండగా, ఉస్మానియా యూనివర్సిటీలోని రెండు కాలేజీల్లో 630 సీట్లు, మహాత్మాగాంధీ వర్సిటీలోని ఒక కాలేజీలో 240, జెఎన్‌ఎఎఫ్‌ఎయులోని ఒక కాలేజీలో 160 అందుబాటులో ఉన్నట్లు సాంకేతిక విద్యాశాఖ తెలిపింది. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని రెండు కాలేజీల్లో 45 సీట్లు, పి.వి.నరసింహారావు ఉద్యానవన వర్సిటీలోని ఒక కాలేజీలో 23 సీట్లు ఉన్నాయి.
ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు ప్రారంభం
రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహించే కౌన్సెలింగ్‌లో కీలకమైన వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈనెల 10వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఆదివారం నాటికి 95654 మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకోగా, 76494 మంది విద్యార్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. ఈనెల 7వ తేదీ వరకు అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం ఉంది. స్లాట్ బుకింగ్ ఆధారంగా ఈ నెల 8 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నెల 18వ తేదీన సీట్ల కేటాయింపు జరుగనుంది. అంతకుముందు ఈసారి కొత్తగా జోసా తరహాలో ఈ నెల 13వ తేదీన మాక్ సీట్ కేటాయింపు చేయనున్నారు. అనంతరం ఈ నెల 14, 15 తేదీలలో అవసరమైతే వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం కల్పించారు. అర్హులైన విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకుని సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని అధికారులు సూచిస్తున్నారు.
జాగ్రత్తగా ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి
ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు జాగ్రత్తగా వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచించారు. కళాశాలల పేర్లు, కోడ్‌లు ఒకే రకంగా ఉన్నప్పుడు నమోదులో అయోమయానికి గురైతే కోరుకున్న కళాశాలకు బదులు మరో కళాశాలలో సీటు లభించే ప్రమాదం ఉంది. బి.టెక్ సిఎస్‌ఇ బదులు పొరపాటుగా సిఎస్‌సి అని ఆప్షన్ ఇస్తే సైబర్ సెక్యూరిటీలో సీటు రావొచ్చు. ఉత్తమ ర్యాంకు వచ్చినా పొరపాట్ల కారణంగా ఎంతోమంది విద్యార్థులు నష్టపోతున్నారు. వెబ్ ఆప్షన్ల నమోదులో ఉదాసీనంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తొలి విడత కౌన్సెలింగే కీలకమని, విద్యార్థులు మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే కళాశాలలు, వాటి ఎప్‌సెట్ కోడ్‌లు, ఆసక్తి ఉన్న కోర్సులు, వాటి కోడ్‌లను వెబ్‌సైట్‌లో ఉన్న మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫాంపై రాసుకొని ఆప్షన్లు నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు