నాగార్జునసాగర్ డ్యామ్ జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం 8 క్రష్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,16,520 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 66,476 క్యూసెక్కుల నీటిని మొత్తం 2,82,364 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు. బుధవారం సాయంత్రానికి నాగార్జునసాగర్ డ్యామ్ 26 క్రష్ట్‌గేట్లలో 16 గేట్లను 5 అడుగులు, 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,65,080 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను ప్రస్తుతం 586.00 అడుగుల వద్ద నీరు నిల్వ ఉంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టిఎంసిలు కాగా ప్రస్తుతానికి 300.3200 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 29,029 క్యూసెక్కుల నీటిని కుడి కాలువ ద్వారా, 8,144 క్యూసెక్కుల నీటిని ఎడమ కాల్వద్వారా, 7,272 క్యూసెక్కుల నీటిని ఎస్‌ఎల్‌బిసి ద్వారా, 1,800 క్యూసెక్కుల నీటిని, లోలెవల్ కెనాల్ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని మొత్తం 3,11,625 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్‌కు పర్యాటకుల తాకిడి..
నాగార్జునసాగర్ ప్రాజెక్టు 26 క్రష్ట్ గేట్ల ద్వారా పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ అందాలను చూసేందుకు రెండో రోజు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. దీంతో సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలన్నీ పర్యాటకులతో కిటకిటలాడాయి. సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు చూసి పర్యాటకులు తమ సెల్ ఫోన్లలో సెల్ఫీలు దిగుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సాగర్‌లో ఉన్న పర్యాటక ప్రాంతాలైన అనుపు, బుద్ధవనం, కొత్త వంతెన, పాత వంతెన తదితర ప్రాంతాల్లో పర్యాటకుల సందడి నెలకొంది. తెలంగాణ టూరిజం ఏర్పాటు చేసిన లాంచీలో వెళ్లేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపారు. నాగార్జునకొండకు రెండు ట్రిప్పులు, రెండు జాలీ ట్రిప్పులు నడిపామని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు.