కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ భారీ భూకంపంతో చిగురుటాకులా గడగడలాడింది. తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్ర భూకంపంకారణంగా 800 మందికి పైగా మరణించారు. 2,500 మంది గాయపడ్డారు. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఎందరో జాడ తెలియకుండాపోయింది. శిథిలల నుంచి జనం పరుగులు పెట్టారు. ఆదివారం రాత్రి సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.0గా నమోదయింది. భూకంపం ముఖ్యంగా నంగాహార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ నగరానికి దగ్గరలోని కునార్ ప్రావిన్స్‌లోని పట్టణాలను దెబ్బతీసింది. భారీ నష్టం సంభవించింది. ఆదివారం రాత్రి 11.47 గంటల ప్రాంతంలో సంభవించిన భూకంపం నంగర్ హార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ నగరానికి ఈశాన్యదిశలో 27 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయిందని అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ తెలిపింది.
8 కిలామీటర్ల లోతులో భూకంపం మొదట సంభవించింది. తర్వాత కూడా పలు సార్లు ప్రకంపనలు జరిగాయి. కూలిపోయిన భవనాల నుంచి గాయపడిన వారిని రక్షించి, హెలికాప్టర్లలో వారిని ఆస్పత్రులకు చేర్చారు. భూకంపంలో 800 మందికి పైగా మరణించారని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ సోమవారం విలేకరులకు తెలిపారు. 2,500 మందికి పైగా గాయపడ్డారు కునార్ ప్రావిన్స్ లోనే ఎక్కువ ప్రాణనష్టం జరిగిందన్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని భవనాలు సాధారణంగా తక్కువ ఎత్తులో కాంక్రీటు, ఇటుకలతో నిర్మించిన భవనాలు, గ్రామాల్లో మట్టి, కలపతో నిర్మించిన ఇళ్లు ఎక్కువ. కునార్ లోని నూర్గల్ జిల్లాలో ఒక గ్రామం పూర్తిగా సర్వ నాశనం అయిందని ఓ వ్యక్తి తెలిపారు.పిల్లలు, పెద్దలు అంతా శిథిలాలలో చిక్కుకు పోయారని తెలిపారు. కూలిన ఇళ్లు..
సహాయం కోసం జనం కేకలు
తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో పర్వత శ్రేణుల్లో ఉన్న గ్రామాలు అక్కడక్కడ ఉన్నాయి. భూకంపంతో కమ్యునికేష్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. తమ కళ్ల ముందే ఇళ్లు కూలిపోవడంతో ఇళ్లలో నిద్రపోతున్న పిల్లలు చనిపోయారని, శిథిలాలకింద చిక్కుకు పోయిన జనం భయంతో కేకలు పెట్టారని బయటపడిన ఓ వ్యక్తి తెలిపారు. పెద్దఎత్తున సహాయ కార్యక్రమాలు మొదలయ్యాయి.శిథిలాల కింద చిక్కుకున్న వారందరినీ రక్షించేందుకు కృషి చేస్తున్నారు. కునార్, సంగర్హార్, రాజధాని కాబూల్ నుంచి వైద్య బృందాలు ఆ ప్రాంతానికి చేరుకుని అత్యవసర చికిత్సలు అందిస్తున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు. 2023 అక్టోబర్ 7న ఆఫ్ఘనిస్తాన్ లో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపంలో కనీసం 4,000 మంది చనిపోయినట్లు తాలిబన్ ప్రభుత్వం అంచనా వేసింది.