Friday, August 29, 2025

ప్రభుత్వ భూములపై విల్లాల నిర్మాణం

- Advertisement -
- Advertisement -

దుండిగల్ మండల పరిధిలోని గాగిల్లాపూర్‌లో మరో రియల్ ఎస్టేట్ కుంభకోణం బహిర్గతమైంది. ప్రణీత్ ప్రణవ్ గ్రో పార్క్ పేరిట 884 విల్లాలు, క్లబ్‌హౌస్ నిర్మాణాలు చేపడుతున్న వెంకట ప్రణీత్ డెవలపర్స్ సంస్థ, చెరువు భూములు, ప్రభుత్వ భూములు, సీలింగ్ ల్యాండ్లను కలిపి తప్పుడు రికార్డులు సృష్టించినట్లు తెలుస్తోంది. గ్రామ రెవెన్యూ రికార్డులు, మ్యాపులు, లేఔట్లు పరిశీలిస్తే ఈ గోల్‌మాల్ తేటతెల్లమవుతోంది.

చెరువును కూడా కలిపేసి
సర్వే నంబర్ 203లో 20 ఎకరాల 9 గుంటల భూమిలో 6 ఎకరాల 27 గుంటలు చెరువుగా రికార్డు. సర్వే నంబర్ 204లో మొత్తం 13 ఎకరాల 36 గుంటలలో కేవలం 7 ఎకరాల 4 గుంటలే ప్రణీత్ సంస్థ పేరుతో ఉన్నాయి. మిగిలినవి ప్రభుత్వ భూములే అయినా, పర్మిషన్లు తెచ్చుకునే సమయంలో 70 ఎకరాల 20 గుంటలుగా చూపించారు. సర్వే నెంబర్ 204/2, 204/4లోని సీలింగ్ భూములూ ఈ లెక్కల్లో కలిపారు. అంతే కాకుండా చెరువు కట్టను సైతం తమ సంస్థ ప్రచారానికి వాడుకుని గ్రీనరీతో లేక్ వ్యూ బోర్డుగా తీర్చిదిద్ది అది కూడా తమ భూమిగానే రికార్డులో చిత్రీకరించారు.

అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు
హెచ్‌ఎండీఏ నుంచి 70 ఎకరాల 20 గుంటలలో 885 గృహాల కోసం అనుమతులు తెచ్చుకున్నారు. కానీ వాస్తవ నిర్మాణాలు మాత్రం ప్రభుత్వ భూములపై సాగుతున్నాయి. సర్వే నెంబర్ 204/2, 204/4లో ఎస్టీపీ ప్లాంట్, 37 విల్లాలు ఉన్నాయి. ఇవన్నీ రికార్డుల్లో సీలింగ్, ప్రభుత్వ భూములుగానే నమోదై ఉన్నాయి. సర్వే నెంబర్ 203లోనూ చెరువును అనుకుని ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి.

చెరువు భూమి కూడా పట్టా ల్యాండ్
మహమ్మద్ ఉస్మాన్ కుంట చెరువు 8 ఎకరాల 8 గుంటల విస్తీర్ణంలో 203, 201, 202 సర్వేలలో ఉంది. అందులో 5 ఎకరాల 30 గుంటలు ఎఫ్‌టిఎల్, 37 గుంటలు బఫర్ జోన్‌గా రికార్డు ఉన్నా మొత్తం చెరువును కూడా పట్టా ల్యాండ్లుగా చూపించి రికార్డులు వక్రీకరించారు. ఈ భూములను 201p, 202p, 203p, 204, 205, 206, 207, 208, 212pతో కలిపి మొత్తం 70 ఎకరాల 21 గుంటలు తమదేనని పేర్కొని పర్మిషన్లు తెచ్చుకున్నారు.

వాస్తవ లేఅవుట్ వర్సెస్ నిర్మాణాలు
లేఅవుట్ ప్రకారం 70 ఎకరాల 20 గుంటలలో, చెరువు ఎఫ్‌టిఎల్ 6 ఎకరాల 32 గుంటలు, బఫర్‌జోన్ ఎకరం 12 గుంటలు, చెరువు కట్ట 27 గుంటలు, ఫీడర్ ఛానెల్ ఏరియా ఇలా మినహాయిస్తే నిర్మాణయోగ్య భూమి కేవలం 60 ఎకరాల 9 గుంటలు మాత్రమే. అందులోనూ రోడ్లు, ఇతర సౌకర్యాలు పోగా, ప్లాట్ ఏరియా 36 ఎకరాల 18 గుంటలు మాత్రమే మిగులుతుంది. కానీ వాస్తవంలో నిర్మాణాలు సర్వే నెంబర్ 204/2, 204/4లో ప్రభుత్వ భూములపైనే జరుగుతున్నాయి. కళ్ళు మూసుకున్న హైడ్రా…పత్తా లేని ప్రభుత్వ యంత్రాంగం పేదోడు చెరువు పక్కన గుడిసె వేసుకున్న, ఇల్లు కట్టుకున్న అక్కడ వాలిపోతున్న హైడ్రా ఇప్పుడు ఇక్కడ ఇంత దారుణంగా చెరువు స్థలంలో నిబంధనలు ఉల్లంఘించి విల్లాలు నిర్మాణం చేపడుతున్నా ఏమి చేస్తుందని స్థానిక ప్రజలు నాయకులు మండిపడుతున్నారు. కొంతమంది బడా నేతల కనుసన్నలో నడుస్తున్న ఈ నిర్మాణాలపై తక్షణమే ప్రభుత్వం దర్యాప్తు జరిపి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మల్కాజ్గిరి ఆర్డీవో శ్యాం ప్రకాష్ వివరణ
గాగిల్లాపూర్‌లో ప్రణీత్ సంస్థ చేపడుతున్న నిర్మాణాలలో ప్రభుత్వ భూమి ఉన్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆర్డీవో శ్యాంప్రకాష్‌ను వివరణ కోరగా రెవెన్యూ అధికారుల నుండి నివేదిక తెప్పించుకున్నాం. నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన వాటిని గుర్తించి రిజిస్ట్రేషన్లు కాకుండా సంబంధిత శాఖలకు లెటర్ రాసి బ్లాక్ లిస్ట్‌లో పెడుతామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News