Wednesday, September 3, 2025

ఒక్కరోజే 9వేల మెట్రిక్ టన్నుల యూరియా: మంత్రి తుమ్మల

- Advertisement -
- Advertisement -

రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎరువుల సరఫరా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచడానికి కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఒక్క రోజులోనే రాష్ట్రానికి 9వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కాగా మరో 5వేల మెట్రిక్ టన్నులు చేరనున్నట్లు వెల్లడించారు. ఈ యూరియా రైల్వే రేక్ పాయింట్లయిన సనత్ నగర్, వరంగల్, జడ్చర్ల, నాగిరెడ్డిపల్లి, మిర్యాలగూడ, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాలకు చేరుకుంటుందని తెలిపారు. ఇంకా వచ్చే వారం రోజుల్లో కరాయికల్, గంగవరం, దామ్ర పోర్టుల ద్వారా మరో 27,470 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరనుందని తెలిపారు.

ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎరువులను రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డిమాండ్ కు అనుగుణంగా పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రైతులకు ఎరువుల కొరత ఉండకుండా అవసరమైన చోట తక్షణమే అందేలా సమన్వయం చేయాలని అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఇటీవల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టానికి పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా, సకాలంలో సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అందుకోసం పంట నష్టం సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని, 5 రోజుల్లో పంటనష్టంపై పూర్తి నివేదికను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. రైతుల సంక్షేమం, వారి పంటల రక్షణ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని మంత్రి పునరుద్ఘాటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News