Wednesday, May 8, 2024

వేట కథల దిట్ట అల్లం

- Advertisement -
- Advertisement -

సాధారణంగా కథల పాఠకులు కొత్తదనం కోరు కుంటారు. ఇది గ్రహించే కథా రచయితలు పాఠకులను తమ కథల పట్ల ఆసక్తిని పెంపొందించే కథా వస్తువులను ఎంచుకునే ప్రయత్నం చెయ్యడం కద్దు. దీనిని పూర్తిగా అర్థం చేసుకుని తెలుగు కథా రచనలో కొత్త ఒరవడిని సృష్టించాడు అల్లం శేషగిరిరావు. ఎన్నో కథలు వచ్చాయి కాని తెలుగులో వేట గురించి కథలు అల్లం శేషగిరిరావు రాసేవరకూ రానేలేదని చెప్పవచ్చు. అడవిలోని క్రూర మృగాల ప్రాకృతిక ధర్మాలను కథా వస్తువుగా తీసుకున్నా, మానవ మానసిక స్థితిని నిగూఢంగా సూచించడమే ఆయన రచనా లక్ష్యంగా ప్రస్ఫుటం అవుతుంది. మామూలుగా కాక, అయన కథలను విశ్లేషణా పరంగా ఆలోచనకు భూమిక చేశాడు.
అల్లం శేషగిరిరావు (డిసెంబర్ 9, 1934 -జనవరి 3, 2000) ప్రముఖ తెలుగు కథా రచయిత. 1934, డిసెంబర్ 9న ఒడిశా (నాటి ఒడిషా)లోని గంజాం జిల్లాలో జన్మించాడు. శేషగిరి రావు కథలు తమాషాకు రాసిన కథలు కావు. జీవితం గురించి రచయిత తీవ్ర ఆలోచన, లోతుగా పరిశీలన, జీవితంలో అన్యాయాల గురించి ఆందోళన, వేటకథల నేపథ్యంగా అర్థం చేసుకోవచ్చు.
వేటాడడం, అడవి మృగాల స్వభావం, సహజ లక్షణం. ప్రాకృతిక ధర్మం కూడా. సంస్కార వంతుడైన మనిషి మృగంలా మారి బలహీనుణ్ని పీక్కుతినే అరాచ కత్వం, బడుగుల మూలుగులను పీల్చేసే బలాధిక్యతల గురించి నిక్కచ్చిగా, నిజాయతీగా మాట్లాడే కథలు తెలుగులో తక్కువ కనిపిస్తాయి. అలాంటి అరుదైన కథలను పాఠకులకు అందించి, ఆలోచింప చేసిన రచయిత అల్లం శేషగిరిరావు. ఆయన తెలుగు హెమింగ్వే గా లబ్ధ ప్రతిష్టులు.
తరాలు మారినా, కాలంలో మార్పు వచ్చినా, అలనాటి నుండి సామాజిక పరిస్ధితులలో ఆశించిన మార్పు రానేలేదు. బలవంతుడు, బలహీనునిపై, నిస్సహాయతలపై ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. నాగరిక ముసుగులో దాగిన ఈ అమానవీయతను ఉన్నది ఉన్న ట్టుగా చూపెడతాయి శేషగిరిరావు కథలు. ఇవి మనిషిలోని జంతు ప్రవృత్తిని తేటతెల్లం చేస్తాయి. ఎవరూ చూడని కొత్తకోణాన్ని దర్శించేం దుకు వీలు కల్పిస్తాయి. కొత్త ఎత్తుగడ, ఉత్కంఠ, ఆసక్తికర ముగింపూ, అటవీ సంబంధ విశేషాలూ, జంతువుల సహజ ప్రవర్తనాస్థితి.. ఇలాంటి అంశాలతో ఈ కథలు పాఠకులను ఆగకుండా చదివింప జేస్తాయి.
రైల్వేలో గుమాస్తాగా పని చేసిన అల్లం శేషగిరిరావు సమాజాన్ని నిశితంగా పరిశీలించిన తీరు అమోఘం, అద్వితీయం, అసమానం. మనుషుల ధోరణుల్లోని మానవీయ, అమానవీయ కోణాలను, అంతః సంఘర్షణలను అయన అర్థం చేసుకని కథా వస్తువులుగా మలచు కున్నాడు. తాను చేసుకున్న అవగాహనకు తనదైన భాష, శిల్పాలను జోడించి పాఠకుల హృదయాలను అంది పుచ్చుకునే అద్భుత కథలు రాశాడు. 1980లో ‘మంచి ముత్యాలు’ పేరిట పుస్తక రూపంలో వచ్చాయి. మరిన్ని కథలను కలుపుకుని ‘అరణ్య ఘోష’గా వెలువడ్డాయి. ఇటీవల కథా స్రవంతి (అరసం) వారు ‘అల్లం శేషగిరిరావు కథలు’ పేరిట ఎంపిక చేసిన వాటిని ప్రచురించారు. శేషగిరిరావు రాసినవి తక్కువే. వాటిలోనూ కొన్ని సుదీర్ఘంగా సాగుతాయి. అయితే.. విషయ ప్రాధాన్యం, వైవిధ్యం మూలంగా ఆ నిడివి పాఠకులను అంతగా బాధించదు. ‘మృగ తృష్ణ, వఱడు, ది డెత్ ఆఫ్ ఎ మేనిటర్, జాతి కుక్క, పులి చెరువులో పిట్టల వేట, అశ్వమేథం, నరమేథం, చీకటి’ తదితరాలు శేషగిరిరావు కథల్లో చెప్పుకో దగినవి. మనిషికి ప్రతిబింబాలు ‘వఱడు’ కథ ‘దర్పణ్ సీరిస్’లో భాగంగా దూరదర్శన్‌లో సింగిల్ ఎపిసోడ్‌గా ప్రసారమైంది. వఱడు లాంటి మనుషులు మన సమా జంలో ఉన్నారని హెచ్చరించిన ఈ కథ, నాటకం గానూ విశేష ఆదరణ పొందింది. వఱడంటే ‘ముసలి నక్క’ అని నిఘంటు అర్థం. ముసలి నక్కలు వాటంతటవి వేటాడి తినలేవు కదా. దాంతో పగలం తా ఇతర జంతువుల ఉనికిని కనిపెట్టి, రాత్రిపూట పులిని వాటిమీదకి ఉసిగొల్పి చంపిస్తాయి. పులి తినగా మిగిలిన మాంసంతో కడుపు నింపు కుంటాయి. ఈ కథలో మనిషిలో దాగుండే జంతు స్వాభావిక క్రౌర్యాన్ని చూపించాడు. అందుకే ఈ కథకు ‘ది డెత్ ఆఫ్ ఎ మేనిటర్’గా పేరు పెట్టాడు. ‘మృగ తృష్ణ’ కథలో కనిపించేది దుప్పి వేట కాదు. అది అక్షరాలా బలహీనుడి మీద బలవంతుడి వేట మాత్రమే.
ఒకరిది విలాసం కొరకు వేట. మరొకరిది జీవిక కోసం పోరుబాట. పులులను దర్జాగా వేటాడి, వాటి చర్మాలను కోటగోడలకి వేలాడ దీసుకునే జమిందారీ లను ఏ చట్టాలూ ఏమీ చేయలేవు. చర్యలు తీసుకోనూ లేవు. పిట్టలను కొట్టి బతికే బడుగు జీవులకే అన్ని శిక్షలూ అమలవు తుంటాయి. కన్నీటిగాథ ‘చీకటి’, ఆరిపోయిన చైతన్యాగ్ని కణాన్ని రాజేస్తుంది.
మనిషికి ప్రతిబింబాలు తుపాకీ చప్పుళ్ల తోనూ, కొండగొర్రె అరు పుల తోనూ, పులి గాండ్రిం పుల తోనూ, దగాపడ్డ దీనుడి మూలు గులతో ప్రతిధ్వనించే శేషగిరిరావు ఏ కథ ను తరిచి చూసినా, వేదనా భరిత ‘అరణ్య ఘోష’ వినపడుతూ ఉంటుంది. ఉదాత్తంగా, గంభీరంగా సాగిపోయే ఈ కథలు ప్రాకృతిక సౌందర్యాన్ని కొత్తకోణంలో చూపిస్తాయి. వైవిధ్య పక్షి జాతుల ప్రస్తావన అక్కడక్కడ మనసును ఉల్లాస పరుస్తుంది. ఉల్లంకి పిట్టలూ, తీతువ పిట్టలూ, పరదలూ, గూడ కొంగలూ, పాముల వార (పెద్ద కొంగలు).. ఇలా పక్షులూ, వాటి గమనాలనూ గమ్మత్తుగా వివరిస్తారు రచయిత. వేటను వర్ణించేటప్పుడు మాత్రం భయానక వాతావరణాన్ని సృష్టిస్తాడు. వేటాడేది మనిషి అయినా, మృగమైనా అడవి రక్తంలో స్నానించినట్టు ఓ భీతావహ చిత్రం కళ్లముందు కదలాడేటట్టు కథని నడిపిస్తాడు. జానెడుపొట్ట కోసం దేవులాడుకొనే దీనుల పోరాటాలు కనిపిస్తాయి.
జంతువుల వేట నేపథ్యంలో మనిషిలో దాగుండే క్రూరత్వాన్ని, నాగరిక సమాజంలో మానవ స్వభావాన్ని మృగాలవైపునుంచి చెప్పుకొస్తాయి అల్లం శేషగిరిరావు కథలు. సాహిత్యంలో వీటిని ‘వేట కథలు’ అన్నారు. కానీ, చారిత్రకంగా వేట అసలు అర్థాన్ని నిర్వచించ గలిగితే ఇవి సమాజంలోని ఆధిపత్య శక్తుల చేతుల్లో నానా హింసలకు గురైన బడుగుల జీవితాలను కళ్లకుకట్టే యాథార్థ గాథలని అర్థమవుతుంది. ఇదే మారణ హోమం ఇప్పటికీ కొనసాగుతుందని ఈ కథలు చదివితే పాఠకులు కచ్చితంగా అంగీకరిస్తారు.
బతుకే బలిపీఠంగా మారుతున్న నేటి సమాజంలో ఆధిపత్యం మీద పోరాటం చేసే వారు ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటారు. చీకటి కోణాలెన్నింటినో వెలుతురు బాట పట్టించిన అల్లం శేషగిరిరావు తర్వాత, మళ్లీ ఇలాంటి కథలు మళ్లీ రానే రాలేదు.

(జనవరి 3న అల్లం శేషగిరిరావు వర్థంతి సందర్భంగా)
రామ కిష్టయ్య సంగన భట్ల, 9440595494

Editorial about Writer Allam Seshagiri Rao Stories

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News