Tuesday, April 30, 2024

పార్టీగేట్ కుంభకోణంలో బ్రిటన్ ప్రధాని జాన్సన్

- Advertisement -
- Advertisement -

Johnson is Britain faces Party Gate scandal

కొవిడ్ ఆంక్షలు ఉల్లంఘించి ‘మందు పార్టీలు’
రాజీనామాకు సొంతపార్టీ ఎంపీల నుంచి ఒత్తిడి..?

లండన్: లాక్‌డౌన్ నిబంధనలు అమలులో ఉన్న సమయంలో బ్రిటన్ ప్రధాని బోరిస్‌జాన్సన్ అధికార నివాసం 10 డౌనింగ్‌స్ట్రీట్‌లో జరిగిన మూడు మందు పార్టీలు ఆయన నాయకత్వాన్ని ప్రశ్నార్థకం చేశాయి. ఈ మందు పార్టీలు సొంత పార్టీ ఎంపీలతోపాటు ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా విమర్శలకు కారణమయ్యాయి. ఈ మూడు సంఘటనలను ఆ దేశ మీడియా పార్టీగేట్ కుంభకోణంగా అభివర్ణిస్తూ కథనాలను వెల్లడిస్తున్నాయి. అందులో రెండు ఫేర్‌వెల్ పార్టీలు గతేడాది ఏప్రిల్ 17న జరిగాయని డైలీటెలీగ్రాఫ్ వెల్లడించింది. మరుసటి రోజున బ్రిటన్ రాణి ఎలిజెబెత్2 భర్త ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలుండగా జాన్సన్ ఆఫీస్ సిబ్బంది పార్టీ చేసుకున్నట్టు ఆ కథనంలో పేర్కొన్నది. మందుతోపాటు సంగీత,నృత్య కార్యక్రమాలు కూడా ఆ పార్టీల్లో జరిగాయని తెలిపింది.

అయితే, వీటికి జాన్సన్ హాజరు కాలేదని ఆ సమయంలో ఆయనకు కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పనిచేసిన జేమ్స్‌స్లాక్ తెలిపారు. మరో పార్టీ 2020 మే 20న జరిగింది. ఎవరి మద్యం వారే తెచ్చుకోవాలి(బియోబ్) అంటూ జాన్సన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ మార్టిన్‌రేనాల్డ్ తరఫున 100మందికి ఇమెయిల్ సందేశాలు పంపినట్టు ఐటివి న్యూస్ తెలిపింది. ఆ మందు పార్టీకి జాన్సన్ భార్య కెర్రీ కూడా హాజరైనట్టు తెలిపింది. దీనిపై ఈ వారం ప్రారంభంలో హౌస్ ఆఫ్ కామన్స్‌లో జాన్సన్ క్షమాపణ కూడా చెప్పారు. ఓవైపు రాణి ఎలిజెబెత్ తన భర్త మరణించి ఒంటరిగా అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో ప్రధాని నివాసంలో విందు పార్టీలు నిర్వహిస్తూ లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని లిబరల్ డెమోక్రాట్ పార్టీ నేత ఎడ్‌డేవీ డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌ను ప్రధాన ప్రతిపక్షం లేబర్‌పార్టీ ఉపనేత ఏంజెలారేయ్‌నర్ కూడా చేశారు. డౌనింగ్‌స్ట్రీట్ మందు పార్టీలపై సీనియర్ అధికారి స్యూగ్రే నేతృత్వంలో అంతర్గత దర్యాప్తునకు మంత్రివర్గం ఆదేశించింది.

నూతన ప్రధానిగా
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్..?

జాన్సన్ పదవీచ్యుడైతే ఆయన స్థానంలో నూతన ప్రధానిగా ఎవరన్నదానిపైనా బ్రిటన్ మీడియాలో ఊహాగానాలు, విశ్లేషణలు వస్తున్నాయి. కాబోయే ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునక్(41) పేరు బలంగా వినిపిస్తోంది. ఈయన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి అల్లుడు. రిషి బ్రిటన్ ఆర్థికమంత్రిగా 2020 ఫిబ్రవరి నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దర్యాప్తు నివేదిక వెల్లడైన తర్వాత జాన్సన్‌ని పదవిలో ఉంచాలా.? లేదా..? అన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నట్టు అధికార కన్సర్వేటివ్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, కాబోయే ప్రధాని పదవికి మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దాంతో, బెట్టింగులు జరుగుతున్నాయి. ఆ బెట్టింగ్‌ల్లో రిషి 15/8 పాయింట్లతో ముందు వరుసలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో విదేశాంగమంత్రి లిజ్‌ట్రస్ 11/4 పాయింట్లతో, మరో మంత్రి మైఖేల్‌గోవే 6/1 పాయింట్లతో మూడోస్థానంలో ఉన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News