రాష్ట్రవ్యాప్తంగా 900 మంది… గ్రేటర్ పరిధిలో 72మంది పోలీసుల ఐసోలేషన్
హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసులను కరోనా వైరస్ వెంటాడుతోంది. రాష్ట్రంలో థార్డ్‌వేవ్‌లో దాదాపు 900మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. తాజాగా రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న 20 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా సోకిన పోలీసులు హోం ఐసోలేషన్ ఉంటూ చికిత్సపొందుతున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.మరోవైపు, పోలీస్ స్టేషన్ లోకి ఎవ్వరినీ అనుమతించవద్దని ఉన్నత అధికారులు సూచించారు. మరోవైపు, ఫిర్యాదుదారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫిర్యాదులు చేసే వారికోసం ప్రత్యేక టెంట్ ఏర్పాటు చేశారు అధికారులు. మాస్క్ లేకుండా ఎవ్వరినీ అనుమతించమని తెలిపిన పోలీసులు సామాజిక దూరాన్ని పాటించాలని చెబుతున్నారు.
ఇదిలావుంటే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 72మంది పోలీసులు కొవిడ్ బారినపడ్డారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో సీఐతో పాటు 14 మంది కానిస్టేబుళ్లకు పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం అందరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ సిసిఎస్, సైబర్ క్రైమ్‌లో పనిచేస్తున్న 20 మంది పోలీస్ సిబ్బందికి కరోనా సోకింది. ఇటీవల సైబర్ క్రైమ్ టీమ్ ఓ కేసు విషయంలో రాజస్థాన్‌కి వెళ్లి వచ్చారు. ఆ టీమ్‌లోని ఎస్‌ఐకి కరోనా పాజిటివ్ రావడంతో అందరికీ సోకినట్లు అనుమానిస్తున్నారు. చైతన్యపురి పిఎస్‌లో 8 మంది కానిస్టేబుళ్లు, వనస్థలిపురంలో ఒకరు, అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఒకరికి కరోనా సోకింది. అల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో నలుగురు సిబ్బంది కొవిడ్ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. ప్రజలంతా మాస్కులు ధరించి కొవిడ్ నిబంధనలు పాటించాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖలో ఇప్పటివరకు 900 మంది పోలీసులకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో పోలీస్‌స్టేషన్‌లకు వచ్చే ఫిర్యాదు దారులు, కేసు విచారణ నిమిత్తం నిందితుల వద్దకు వెళ్లే పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు శాఖ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.