Friday, May 3, 2024

సలేశ్వరం ఉత్సవాలకు రావొద్దు

- Advertisement -
- Advertisement -

Devotees are not allowed to go to Saleshwaram

భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రమాదం
కొండలపై నుంచి భారీగా రాళ్లు పడుతున్నాయి
హెచ్చరిక జారీ చేసిన అధికారులు

మనతెలంగాణ/హైదరాబాద్ : నల్లమల అటవీ ప్రాంతంలో రెండోరోజూ కూడా వర్షం కురుస్తున్న నేపథ్యంలో సలేశ్వరం వెళ్లేందుకు భక్తులకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. కొండల పైనుంచి గుండంలోకి రాళ్లు జారిపడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండడంతో సలేశ్వర క్షేత్రంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి కూడా భారీ వర్షం కురవడంతో సలేశ్వర క్షేత్రానికి వెళ్లే మార్గమంతా బురదమయంగా మారింది. ఈ నేపథ్యంలో ఇకపై భక్తులు సలేశ్వర క్షేత్రానికి రావొద్దని అధికారులు సూచించారు. ఏటా చైత్ర పౌర్ణమి సందర్భంగా నిర్వహించే సలేశ్వరం ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివస్తారు.

సలేశ్వరం ప్రత్యేకత ఇలా..

ఎత్తయిన కొండ నుంచి జాలువారే జలపాతం, కొండలోని గుహలో కొలువుదీరిన లింగమయ్యను చూడడానికి భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఈ యాత్రను తెలంగాణ అమరనాథ్ యాత్రగా భక్తులు అభివర్ణిస్తారు. జనావాస ప్రాంతానికి 25 కి.మీల దూరంలో దట్టమైన కీకారణ్యంలోని సలేశ్వర క్షేత్రంలో వెలసిన లింగమయ్య స్వామి ప్రత్యేక ఉత్సవాలు ఏటా చైత్ర పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తారు. ఇక్కడి చెంచులే పూజారులుగా ఉండి లింగమయ్యకు పూజలు నిర్వహిస్తారు. స్వామిని వారిని దర్శించుకోవాలంటే ఏటవాలుగా ఉన్న కొండల మధ్య నుంచి ప్రయాణించాల్సి ఉంటుంది. మార్గమంతా దుర్భేద్యంగా ఉంటుంది. మోకాళ్ల కురువ నుంచి 6 కిలో మీటర్లు రాళ్లు తేలిన దారిపై కొండలు దిగుతూ లింగమయ్య దర్శనానికి భక్తులు వెళ్తారు. అలాగే ఫర్హాబాద్ నుంచి రాంపూర్ పెంట మీదుగా, మరోవైపు లింగాల మండలం అప్పాయపల్లి నుంచి గిరిజన గుండాల దారి మీదుగా భక్తులు సలేశ్వర క్షేత్రానికి చేరుకొని లింగమయ్యను దర్శించుకుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News