Tuesday, May 21, 2024

కలిమేడులో రథోత్సవ విషాదం

- Advertisement -
- Advertisement -

11 Killed in Electrocution During Chariot Procession in Thanjavur

హైటెన్షన్ వైర్ల మంటలతో 11 మంది ఆహుతి
కాలిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు
రంగుల శిఖరం ఒరిగి పెను ముప్పు

తంజావూర్ : తమిళనాడులో తెల్లవారుజామున జరిగిన ఆలయ రథోత్సవం పెనువిషాదం నింపింది. తంజావూర్‌కు సమీపంలోని కలిమేడులోని అప్పర్ ఆలయ రథం తిరిగి గుడికి చేరుకుంటుండగా రథం పై ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుద్ఘాతంతో 11 మంది ఆహుతి అయ్యారు.వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.17 మంది గాయపడ్డారు. రథం తంజావూర్ బూడాలూరు రాదారిలో సాగుతూ ఉండగా రథం పై భాగం కరెంటు వైర్లకు తాకిందని అధికారులు తెలిపారు. ఇవి హై టెన్షన్ వైర్లు కావడంతో రథం అంటుకోవడం, దీని చుట్టూ ఉన్న వారిలో కొందరు సజీవ దహనం చెందారని వివరించారు. కొందరు మంటలకు వొళ్లు కాలి గాయాలతో ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు. సాఫీగానే రధయాత్ర సాగుతూ ఉండగా పద్ధతి ప్రకారం బాగా అలంకరించి పైన శిఖరం వంటి అమరికతో ఉన్న రథం ఓ చోట ఏదో అడ్డంకితో వైపు ఒరిగింది . దీనిని భక్తులు తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు యత్నించారు.

ఈ దిశలోనే రథం పై భాగం హెచ్‌టి వైర్లను తగిలిందని, పిల్లలు అక్కడిక్కడే మరణించారని మిగిలిన వారు ఆసుపత్రికితరలించే దారిలో ప్రాణాలు కొల్పోయ్యారని తిరుచ్చి ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు వి బాలకృష్ణన్ వార్తాసంస్థలకు తెలిపారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ప్రాధమిక సమాచారం ప్రకారం ఇది నిర్లక్షంతో జరిగిన ప్రమాదం అని తేలింది. అయితే పూర్తి స్థాయి దర్యాప్తు తరువాతనే నిర్ధారణ ఉంటుందని ఐజి చెప్పారు. అత్యంత విషాదకర ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ప్రధాని మోడీ, తమిళనాడు సిఎం స్టాలిన్ దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి పరిధిలో మృతుల కుటుంబాలకు రూ 2 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ 50వేల చొప్పున సాయం ప్రకటించారు.

తమిళనాడు సిఎం ఈ ఘటన తనను కలిచివేసిందని , మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నానని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ 5 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో సిఎం స్టాలిన్ ఈ ఘటన గురించి ప్రస్తావించారు. కలిమేడులో ఉదయం రథోత్సవం విషాదకర ఘట్టం అని పేర్కొంటూ మృతులకు సంతాప సూచకంగా సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు తమ సభ ద్వారా ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. తాను ఘటన జరిగిన కలిమేడుకు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News