మనతెలంగాణ/ హైదరాబాద్ : వెనుకబడిన కులాల సంక్షేమం, రిజర్వేషన్ల అధ్యయనం కోసం తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో రాష్ట్ర బిసి కమిషన్ బృందం పర్యటించనున్నది. మూడు రాష్ట్రాల అధ్యయనంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ డాక్టర్ వకళాభరణం కృష్ణమోహన్‌రావు ఆధ్వర్యంలో కమిషన్ సభ్యులు శుభప్రద్‌పటేల్ నూలి, సిహెచ్ ఉపేంద్ర, కె. కిషోర్‌గౌడ్‌ల బృందం తమిళనాడు బిసి కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎమ్.తనికాచలం, సభ్యులతో భేటి కానున్నది.
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో బిసి రిజర్వేషన్‌ల శాతం నిర్ణయించడానికి కావలసిన కొలమానాలు, సమాచార సేకరణ నిమిత్తం బిసి కమిషన్ ఈ భేటిలో చర్చించనున్నది. బుధవారం ఉదయం చెన్నైకి బయలుదేరి వెళ్తున్న బిసి కమిషన్ బృందం మధ్యాహ్నం రామకృష్ణమఠ్ రోడ్, మైలాపూర్‌లో ఉన్న తమిళనాడు బిసి కమిషన్ కార్యాలయంలో అక్కడి చైర్మన్, సభ్యులతో సమావేశం కానున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి 13 వరకు మూడు రోజుల పాటు ఈ బృందం తమిళనాడులో పర్యటించనున్నది. పూర్వ బిసి కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎమ్.ఎస్.జనార్థనం, ముఖ్య ప్రభుత్వ కార్యదర్శులు, పంచాయతీరాజ్ శాఖ, బిసి సంక్షేమశాఖ, ఇతర సామాజిక వేత్తలు, న్యాయనిపుణులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.