Tuesday, April 30, 2024

తూర్పు ఉక్రెయిన్ పట్టణాలపై రష్యా బాంబుల వర్షం

- Advertisement -
- Advertisement -

Russian bombardment of cities in eastern Ukraine

 

పొక్రోవ్స్( ఉక్రెయిన్ ): తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా, ఉక్రెయిన్ సైనిక దళాలు భీకర పోరు సాగిస్తున్నాయి. డోన్బాస్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా సైన్యం తీవ్రంగా పోరాడుతోంది. మారియుపోల్ తరువాత డోన్బాస్‌పై రష్యా సైన్యాలు పూర్తి స్థాయిలో దృష్టిపెట్టాయి. తూర్పు నగరం సివిరో డోంటెస్క్ పై రష్యా దళాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయని ఉక్రెయిన్ ప్రాంతీయ అధికారులు వెల్లడించారు. విద్యుత్ సరఫరాతోపాటు సెల్‌ఫోన్ సర్వీసులు పనిచేయడం లేదని చెప్పారు. అక్కడ నుంచి తరలిపోని ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అనేక ఉత్పత్తుల తయారీ కేంద్రంగా ఉంటున్న సివిరోడోంటెస్క్ నగరం ఉక్రెయిన్ పారిశ్రామిక డోన్బాస్ రీజియన్‌కు ఆయువు పట్టు వంటిది. దీన్ని స్వాధీనం చేసుకోడానికి ఇదే కేంద్రంగా రష్యా భావిస్తోంది. సమీపాన ఉన్న లిసిచనస్క్ ను స్వాధీనం చేసుకోడానికి రష్యా తన దాడులను ముమ్మరం చేసింది. ఈ రెండు నగరాల్లో యుద్ధానికి ముందు దాదాపు రెండు లక్షల మంది జనాభా ఉండేవారు. ఉక్రెయిన్ అధీనంలోని లుహాన్‌స్క్ ప్రావిన్స్‌లో ఇవి పెద్ద ప్రాంతాలు.

వీటిని మాస్కో అనుకూల వేర్పాటు వాదులు ఇంతవరకు స్వాధీనం చేసుకోలేక పోవడంతో రష్యా ఆయా ప్రాంతాలను ఆక్రమించుకోవడంపై దృష్టి పెట్టింది. శనివారం రాత్రి వీడియోలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రసంగిస్తూ తూర్పు ఉక్రెయిన్‌లో పరిస్థితి సంక్లిష్టంగా ఉందన్నారు. డోంటెస్క్ రీజియన్‌లో కీలకమైన రైల్ హబ్‌గా ఉన్న చిన్న నగరం లైమాన్ చుట్టూ ఆదివారం ఉదయం రష్యా దళాలు ముట్టడించాయని ఉక్రెయిన్ మిలిటరీ వెల్లడించింది. లైమాన్‌పై పట్టు చిక్కితే డోంటెస్క్, లుహాస్‌స్క్‌ను స్వాధీనం చేసుకోవడం రష్యాకు మరింత సులభతరం అవుతుంది. ఈ రెండు ప్రావిన్స్‌లను కలిపి డోన్బాస్‌గా వ్యవహరిస్తారు. లైమాన్‌ను స్వాధీనం చేసుకున్నామని రష్యా ప్రకటించినా ఉక్రెయిన్ అధికారులు మాత్రం ధ్రువీకరించడం లేదు. ఉక్రెయిన్ ఉత్తరాన ఖర్కివ్, సుమీ రీజియన్లపై రాత్రికి రాత్రి రష్యా వైమానిక దాడులను ముమ్మరం చేసింది. ఉక్రెయిన్ రెండో పెద్ద నగరమైన ఖర్కివ్‌పై ఆదివారం ఉదయం రష్యా బాంబులు కురిపిస్తోందని ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీస్ పేర్కొంది. ఖర్కివ్‌కు వాయువ్యంగా 40 కిమీ దూరంలో ఉన్న జొలొచివ్ పట్టణంలో రష్యా బాంబుల దాడికి ఒక ఇంటిలో 50 ఏళ్ల వృద్ధుడు, 62 ఏళ్ల వృద్ధురాలు తీవ్రంగా గాయపడ్డారని ఖర్కివ్ రీజినల్ ప్రాసెక్యూటర్స్ కార్యాలయం ప్రకటించింది. ఖర్కివ్‌కు తూర్పున ఉన్న సుమీ రీజియన్ సరిహద్దు ప్రాంతాల్లో ఆరు క్షిపణుల దాడులు జరిగాయని ఉక్రెయిన్ సరిహద్దు రక్షక దళాల సర్వీస్ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News