బెంగళూరు : ప్రధాని మోడీ కర్ణాటకలో రెండు రోజులు పర్యటించడానికి సోమవారం వస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంతోపాటు అనేక కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సెంటర్‌లో ప్రధాని రెండు కార్యక్రమాల్లో పాల్గొంటారని ఒకటి ప్రారంభోత్సవరం, రెండోది శంకుస్థాపన కార్యక్రమాలని వివరించారు. అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌ను ప్రారంభిస్తారని బొమ్మై చెప్పారు. రైల్వేస్, నేషనల్ హైవే అధారిటీకి చెందిన వివిధ పనులకు శంకుస్థాపన చేస్తారు. బెంగళూరులో బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఈమేరకు తాము అన్ని ఏర్పాట్లు చేశామని, ఈ కార్యక్రమాలన్నిటినీ సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తారని ముఖ్యమంత్రి చెప్పారు. సోమవారం సాయంత్రం మైసూరులో బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. తరువాత సుత్తూరు మఠాన్ని, చాముండీ క్షేత్రాన్ని సందర్శిస్తారు. మంగళవారం మైసూరు ప్యాలెస్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. అక్కడ నుంచి తిరువనంతపురం వెళ్తారు. మైసూరు లోని సుత్తూరు మఠంలో వేదపాఠశాలను జాతికి అంకితం చేస్తారు. యోగా, భక్తిపై వ్యాఖ్యానాలను విడుదల చేస్తారు.