Saturday, May 4, 2024

పార్లమెంట్ సభ్యులకు తలంటు

- Advertisement -
- Advertisement -

Parliament House can't be used for dharnas

గుమికూడొద్దు.. నిరసనలకు దిగొద్దు
ఎంపిలు పద్ధతితో మొదలాల్సిందే
రాజ్యసభ సచివాలయ సర్కులర్
అప్రజాస్వామికమని విపక్షం నిరసన
గొంతునొక్కి, కట్టిపడేసే చర్యలని వ్యాఖ్యలు
సాధారణ తంతే అని అధికార వివరణ

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ను ధర్నాలు, నిరసనలకు వేదికగా మల్చుకోరాదని రాజ్యసభ సచివాలయం శుక్రవారం సర్కులర్ వెలువరించింది. లోపల కానీ పార్లమెంట్ ఆవరణలో కానీ గుంపుగా చేరడం, నిరసనలకుదిగడం కుదరదని ఈ ఆదేశాలలో తెలిపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ఆరంభం అవుతున్న దశలో ఈ సర్కులర్‌ను వెలువరించారు. దీనిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిరసనలు వ్యక్తం చేసే హక్కు అధికారం తమకు ఉందని తేల్చిచెప్పాయి. అయితే ఇది సాధారణ సర్కులర్ అని రాజ్యసభ నిర్వహణాధికారులు వివరణ ఇచ్చారు. పార్లమెంట్ సెషన్ ఆరంభానికి ముందు ప్రతిసారి ఈ విధమైన నిబంధనలతో కూడిన ప్రకటన వెలువరించడం సాధారణ అంశం అవుతుందని తెలిపారు. 2013లో కాంగ్రెస్ ఆధ్వర్యపు యుపిఎ హయాంలో కూడా ఇటువంటి నోటీసులు వెలువరించారు.

కావాలంటే అప్పటి సర్కులర్‌ల ప్రతులను చూడండని వాటిని అధికారులు ప్రతిపక్షాలకు పంపించారు. పలు సంవత్సరాల పాటు ఇటువంటి ప్రక్రియ అమలులో ఉందని, కొత్తది కాదని స్పష్టం చేశారు. ధర్నాలు నిరసనలకు దిగకుండా తగు విధంగా సభ్యులంతా దయచేసి సహకరించాలని పేర్కొంటూ రాజ్యసభ సెక్రెటరీ జనరల్ పిసి మోడీ తరఫున తాజా బులెటిన్ వెలువడింది. ‘సభ్యులు ఏ విషయంపై అయినా కూడా పార్లమెంట్ సభా ప్రాంగణంలో ఆవరణలో ప్రదర్శనలకు దిగరాదు. ధర్నాలు, సమ్మెలకు పాల్పడరాదు. నిరాహారదీక్షకు పాల్పడరాదు. లేదా ఆవరణను మతపరమైన క్రతువులు నిర్వహించుకునేందుకు వినియోగించుకోరాదు’ అని ప్రకటనలో తెలిపారు. ఈ సర్కులర్‌పై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, చీఫ్ విప్ జైరాం రమేష్ స్పందించారు. విష్‌గురు తాజా బ్రహ్మస్తం ఇది…ధర్నా మానా హై అని స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసే అధికార జులుం చర్యలలో ఇదొక్కటి అని సిపిఎం నేత సీతారాం ఏచూరి విమర్శించారు. ప్రభుత్వ తంతు ఓ ప్రహసనం అవుతోంది. దారుణంగా వ్యవహరిస్తోంది.

భారత ఆత్మను నులిమివేసే చర్య ఇది అని పేర్కొన్నారు. ఆర్జేడీ నేత మనోజ్ ఝా స్పందిస్తూ ఇది తప్పుడు చర్య అని , వెంటనే రాజ్యసభ అధ్యక్షులు, స్పీకర్ కలుగచేసుకుని తీరాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆవరణలో నిషేధానికి దిగారు. ఇక ముందు పార్లమెంటరీ ప్రశ్నలపై కూడా ఇటువంటి సర్కులర్ వెలువరిస్తారేమో అని శివసేనకు చెందిన ప్రియాంక చతుర్వేది ఈ సర్కులర్‌ను జతపరుస్తూ ట్వీట్ వెలువరించారు. సభలో అన్ పార్లమెంటరీ పదజాలాన్ని వాడరాదని పేర్కొంటూ లోక్‌సభ సెక్రెటెరియట్ నుంచి సర్కులర్ వెలువడ్డ మరుసటి రోజే ఈ రాజ్యసభ నోటీసు వెలువడింది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయి నిరసనలు వ్యక్తం చేశాయి. సాధారణంగా పార్లమెంట్ సెషన్స్ దశలో ప్రతిపక్షాలు ఏదైనా అంశం గురించి సభలోపల భైఠాయించడం, లేదా పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని నిరసనలకు దిగడం ఆనవాయితీగా ఉంది. ఈ హక్కును హరిస్తారా? అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

పార్లమెంట్‌లో మాటలొద్దు చేష్టలొద్దా
ఏదైనా విషయంపై ఏ విధంగా మాట్లాడాలనేది కేంద్ర సర్కారు నిర్ధేశిస్తే, కొన్ని పదాలు వాడరాదని పేర్కొంటే ఇక ప్రజా ప్రతినిధులు సభలో స్వేచ్ఛగా మాట్లాడేది ఎలాగని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. సభలోపల తమ మాటలపై సెన్సార్లు, సభ వెలుపల నిరసనలపై కొరడాలతో ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోంది? ప్రతిపక్షాలను సాధించి వేధించాలని చూస్తోందా? అని పలువురు ప్రతిపక్ష నేతలు నిలదీశారు. అయితే సభా మర్యాదలను పాటిస్తూ సభ్యులు తమ ప్రసంగంలో ఏ పదం అయినా వాడవచ్చునని, అయితే సందర్భోచితంగా ఉన్నాయా? వాటి తీరుతెన్నుల మాటేమిటి ? అనేది గ్రహించి నిర్థారించుకుని పదజాలాన్ని తొలిగించడం అయితే జరుగుతుందని స్పీకర్ ఓంబిర్లా ప్రతిపక్షాలకు వివరణ ఇచ్చారు. అన్ పార్లమెంటరీ పదజాలాల జాబితాలో ప్రతి ఏటా కొత్త పదాలు వచ్చిచేరుతుంటాయి. ఇది సర్వసాధారణం. ఏది ఏమైనా పదాల ఎత్తివేత వాటిని తొలిగించడంపై పూర్తి స్థాయి అధికారం కేవలం సభాధ్యక్షులదేఅయి ఉంటుందని స్పీకర్ తేల్చిచెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News