Friday, May 3, 2024

ఉచితాలకు చెక్ చెప్పే మార్గముందా?

- Advertisement -
- Advertisement -

Supreme Court concerns over guarantees of freebies in elections

కేంద్రం వైఖరిని కోరిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఎన్నికలో ఉచితాల హామీలపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన విషయమని, ఉచితాలను నిరోధించే చర్యలపై ఓ వైఖరితో ముందుకు రావాలని కేంద్రాన్ని కోరింది. ఎన్నికల స్రచారాల సమయంలో రాజకీయ పార్టీలు హేతుబద్ధం కాని ఉచితాల హామీలను ఇవ్వడం, ఉచిత తాయిలాలను పంచడాన్ని నిరోధించేందుకు మార్గమేదైనా ఉందో ఫైనాన్స్ కమిషన్‌నుంచి తెలిసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ప్రభుత్వాన్ని కోరింది. కాగా ఉచితాలు, ఎన్నికల హామీలకు సంబంధించిన నిబంధనలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఉన్నాయని, ఉచితాలపై నిషేధం విధించే చట్టాన్ని ప్రభుత్వమే తీసుకు రావలసి ఉంటుందని ఇసి తరఫున హాజరైన న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఇదే విషయాన్ని ఇసి తన అఫిడవిట్‌లోను స్పష్టం చేసింది. ఎన్నికల మేనిఫెస్టో ఎలాంటి వాగ్దానం కాదని గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులున్నాయని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

అయితే ఉచిత హామీలపై ఇసినే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్ పేర్కొన్నారు. ఈ విషయంలో తమకు అధికారం లేదని, ఇసినే ఒక నిర్ణయం తీసుకోవాలని మీరు లిఖితపూర్వకంగా ఎందుకు ఇవ్వకూడదని నటరాజ్‌ను ఉద్దేశించి జస్టిస్ ఎన్‌వి రమణ ప్రశ్నించారు. దీనికి నటరాజ్‌నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో ఉచితాలపై ప్రభుత్వం తన వైఖరిని తెలిపితే వీటిని కొనసాగించాలా లేదా అనేది తాము నిర్ణయిస్తామని రమణ చెప్పారు. కాగా వేరే కేసు విషయంలో కోర్టులోనే ఉన్న సీనియర్ న్యాయవాది కపిల్‌సిబల్‌నుద్దేశించి దీనిపై మీ అభిప్రాయం చెప్పాలని చీఫ్ జస్టిస్ కోరారు. ఉచితాలు తీవ్రమైన అంశమని,ఈ విషయంలో ఫైనాన్స్ కమిషన్ కార్యాచరణకు దిగాలని, కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. రాజకీయ అంశాలు ముడిపడి ఉన్నందున ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని తాను భావించడం లేదని కూడా ఆయన చెప్పారు.

ఫైనాన్స్ కమిషన్ స్వతంత్ర సంస్థ అని, రాష్ట్రాలకు నిధులను కేటాయించే సమయాంలో ఆ రాష్ట్రాల అప్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ఉచిత హామీలు అవి నెరవేర్చడానికి సాధ్యమో కాదో పరిశీలించాలని సిబల్ సూచించారు. ఈ విషయాన్ని పరిశీలించాలని, దీనిపై కేంద్రంనుంచి తగు సూచనలు తెలుసుకొని తదుపరి విచారణ అయిన ఆగస్టు 3 లోగా తెలియజేయాలని బెంచ్ అదనపు సొలిసిటర్ జనరల్‌ను కోరింది. కాగా ఉచితాలపై హామీల వర్షం గుప్పించి పతనమైన శ్రీలంక దిశగా మనం పయనిస్తున్నామని, మన ఆర్థిక వ్యవస్థ కూడా కుప్ప కూలుతుందని పిటిషన్ దాఖలు చేసిన అశ్వినీ ఉపాధ్యాయ్ ఆందోళన వ్యక్తం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News