Thursday, May 9, 2024

బీజేపీ ఆదేశాలపై నడుస్తున్న పంజాబ్ గవర్నర్

- Advertisement -
- Advertisement -

Governor of Punjab running on orders of BJP

లక్ష్మణరేఖ ఏమిటో తెలుసుకోవాలి : ఆప్ ధ్వజం

చండీగఢ్ /న్యూఢిల్లీ : పంజాబ్ లోని అధికార పార్టీ ‘ఆప్’ రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్‌కు వ్యతిరేకంగా తన విమర్శనాస్త్రాల దాడికి మరింత పదును పెట్టింది. బీజేపీ ఆదేశానుసారం గవర్నర్ ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తింది. ఇదే సమయంలో న్యూఢిల్లీ లోని ఆప్ ముఖ్య అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ తన పరిధి ఏమిటో తెలుసుకుని ప్రవర్తించాలే తప్ప లక్ష్మణ రేఖ దాటొద్దని గవర్నర్‌కు సూచించారు. సెప్టెంబర్ 27న నిర్వహించడానికి ప్రతిపాదించిన పంజాబ్ అసెంబ్లీ సమావేశాల్లో చేపట్టనున్న శాసన సభా వ్యవహారాల వివరాలను గవర్నర్ కార్యాలయం కోరడంపై తాజాగా ఈ విమర్శల దాడి జరిగింది. విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడానికి సెప్టెంబర్ 22న ప్రత్యేక శాసన సభా సమావేశాలను ప్రభుత్వం ప్రతిపాదించగా గవర్నర్ పురోహిత్ అడ్డుతగలడంపై ఆగ్రహం వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. పంజాబ్ కేబినెట్ ఈ విషయంలో ఎలాంటి సంఘర్షణ కోరుకోవడం లేదని, అయితే తమ రాజ్యాంగపరమైన హక్కులకు ఎవరైనా విఘాతం కలిగించడం ఆమోదయోగ్యం కాదని ఆప్ నేత , పంజాబ్ కేబినెట్ మంత్రి అమన్ అరోరా వ్యాఖ్యానించారు.

బీజేపీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం తన పార్టీ ఆపరేషన్ లోటస్‌ను విజయవంతం చేసే ప్రయత్నాల్లో భాగంగా సెప్టెంబర్ 22న నిర్ణయించిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను గవర్నర్ రద్దు చేశారని తీవ్రంగా ఆరోపించారు. చండీగఢ్‌లో మీడియా సమావేశంలో గవర్నర్ బీజేపీ ఆదేశానుసారం నడుస్తున్నారని ఆరోపించారు. “ నిన్న సిగ్గుపడే సంఘటన జరిగింది. గత 75 ఏళ్లలో ఇలా ఎప్పుడూ జరగలేదు. శాసన సభా వ్యవహారాలను తెలియజేయాలని కొత్తగా గవర్నర్ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం ” అని అరోరా ఆక్షేపించారు. అసలు సంప్రదాయం ప్రకారం శాసన సభ సమావేశాల్లో చేపట్టనున్న వ్యవహరాలను అఖిల రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడిన బిజెనెస్ అడ్వయిజరీ కమిటీ నిర్ణయిస్తుందని అరోరా చెప్పారు.

మొత్తం 117 మంది ఎమ్‌ఎల్‌ఎలు ప్రజాసమస్యలపై చర్చించి తీర్మానించడానికి అంగీకరిస్తే గవర్నర్ ఎందుకు భయపడుతున్నారు ? అని అరోరా ప్రశ్నించారు. బీజేపీయేతర ప్రభుత్వాల రాష్ట్రాల్లో గవర్నర్ల నివాసాలు కుట్రలు పన్నేవిగా తయారయ్యాయని ఆరోపించారు. ఆప్ ప్రభుత్వం ఉన్న ఢిల్లీ లోనూ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రతిపక్షంలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. “ పంజాబ్‌లో బిజేపికి ఇద్దరు ఎమ్‌ఎల్‌ఎలుండగా, వారికి కాంగ్రెస్ పూర్తిగా మద్దతు ఇస్తోంది. ఇక్కడ గవర్నర్ విపక్షం పాత్ర వహించడానికి కేంద్రం అధికారం ఇవ్వడం వల్లనే ప్రతిరోజూ అలాంటి లేఖలు జారీ అవుతున్నట్టు తాను అభిప్రాయపడుతున్నానని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News