Monday, May 6, 2024

రైతాంగంపై పన్ను ఆలోచన దుర్మార్గం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైతాంగంపై మోడీ ప్రభుత్వం పన్ను వేయాలనుకోవడం దుర్మార్గమని, ఈ ఆలోచనను మో డీ తక్షణమే వెనక్కి తీసుకోవాలని రైతుబంధు సమితి చైర్మన్, ఎంఎల్‌సి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, యెగ్గే మల్లేశంతో కలిసి బిఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం ఖర్చు రెట్టింపు చేసిన కేంద్ర ప్రభుత్వం పన్ను వేయాలని అనుకోవడం అనాలోచిత చర్య అని ఆయన అభివర్ణించారు. నాలుగు రోజుల క్రితం మోడీ ఆర్థిక సలహా మండలి చైర్మన్ వివేక్ దేబ్‌రాయ్ ఓ పత్రికలో వ్యాసం రాశారని, రైతుల ఆదాయంపై పన్ను వేయాలని వివేక్ సూచించారని పల్లా ఆరోపించారు. బ్రిటిష్ హాయంలో కూడా రైతుల ఆదాయం పై పన్ను వేయాలని ప్రతిపాదించారని ఆయన ఉదహరించారు.

ఇది వివేక్ దేబరాయ్ మాటగా తాము భావించడం లేదన్నారు. మోడీ మన్ కీ బాత్ గా తాము భావిస్తున్నామన్నారు. సంస్థానాల వ్యవస్థ అమల్లో ఉన్నప్పుడు రైతుల ఆదాయం పై పన్ను వేశారని దేబరాయ్ చెప్పుకొచ్చారని ఆయన తెలిపారు. భారత్ గ్రామాల్లోనే నివసిస్తుందని, ఇంకా పేదరికంలోనే ఉన్న రైతులపై పన్నులు వేయాలని ఆలోచన రావడం దుర్మార్గమన్నారు. మోడీయే స్వయంగా ఎన్నోసార్లు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. 60 సంవత్సరాల పైబడి ఉన్న రైతులకు పెన్షన్ ఇస్తామని బిజెపి మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని అయినా అమలు చేయడం లేదన్నారు. వ్యవసాయానికి 30 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తామని బిజెపి మేనిఫెస్టోలో పెట్టి మాట తప్పిందన్నారు. మోడీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయకపోగా పెట్టుబడి వ్యయాన్ని రెట్టింపు చేసిందన్నారు. మోడీ హయాంలో ఎరువుల ధరలతో పాటు వ్యవసాయంతో సంబంధం ఉన్న అన్నీ ధరలు పెరిగాయన్నారు.
రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది తెలంగాణ
రైతుల ఆదాయంపై పన్ను నిర్ణయం రాష్ట్రాల పరిధి లోనిదని వివేక్ దేబరాయ్ పేర్కొంటున్నారని, వివేక్ ఉన్నది పిఎం ఆర్థిక సలహా మండలి చైర్మన్ అని, ఆయన రాష్ట్రాలకు ఉచిత సలహా ఎలా ఇస్తారని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ తక్షణమే ఆర్థిక సలహా మండలి చైర్మన్ బాధ్యతల నుంచి వివేక్‌ను తప్పించాలని, మోడీ వెంటనే స్పందించకపోతే రైతుల ఆదాయం పై పన్ను ఆయన ప్రతిపాదనగానే భావించాల్సి ఉంటుందని పల్లా ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ఈ ఆలోచనను విరమించు కోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని బిఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోందన్నారు. రైతాంగాన్ని చంపి వ్యవసాయాన్ని కార్పొరేట్ల చేతిలో పెట్టేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల సంఖ్యను ఇప్పటికే తగ్గించిందని, రైతుల ఆదాయంపై పన్నుకు కూడా కేంద్రం వెనకాడదని ఆయన ఆరోపించారు. రైతులకు ఎన్నో రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన తెలిపారు.
బ్రిటీషర్లను అనుసరిస్తారా ?
బ్రిటిష్ హాయంలో చేసిన చట్టాలను ఒక్కోక్కటిగా రద్దు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయంపై పన్ను విషయంలో బ్రిటీషర్లను అనుసరిస్తారా అని ఆయన పల్లా ప్రశ్నించారు. రిపబ్లిక్ డే వేడుకలు ఎలా జరుపుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమని, గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత ఇబ్బంది పెడుతున్నా తాము సంయమనం పాటిస్తున్నామన్నారు. ప్రభుత్వ ప్రోటోకాల్‌ను తాము పాటిస్తున్నామని బిజెపి ప్రోటోకాల్‌ను పాటించడం కుదరదన్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కూడా గవర్నర్ తన దగ్గరే పెట్టుకున్నారని పల్లా పేర్కొన్నారు.
రైతులు తిరగబడతారు: ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం
ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం మాట్లాడుతూ రైతుల ఆదాయంపై పన్ను వేయాలన్న కేంద్రం ఆలోచన పెద్ద కుట్ర అని కేంద్రానికి రైతులను బాగు చేయాలన్న ఆలోచన ఉందా, నష్ట పరిచే ఆలోచన ఉందా అని యెగ్గే పేర్కొన్నారు. కేంద్రం పన్ను వేయాలని ఆలోచిస్తే రైతులు తిరగబడతారని, సాగు చట్టాలపై క్షమాపణ చెప్పిన ప్రధాని మళ్లీ రైతులను ఇబ్బంది పెట్టే ఆలోచన చేయడం సరికాదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News