Tuesday, May 14, 2024

ఎస్సై నుంచి అసిస్టెంట్ పోలీస్ కమీషనర్‌గా ఎదిగిన మోహన్‌కుమార్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/దమ్మపేట : మారుమూల ఏజెన్సీ గ్రామంలో జన్మించి ఎవరికీ తెలియని ఓ వ్యక్తి నేడు నగరంలో శాంతిభద్రతలు పరిరక్షిస్తూ ఓ పోలీస్ ఉన్నతాధికారిగా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. దమ్మపేట మండలం, పట్వారిగూడెం గ్రామంలో శ్రీరాముల రామకృష్ణారావు, లక్ష్మిపారిజతం దంపతులకు నలుగురు సంతానం, అందులో నాల్గవ సంతానంగా శ్రీరాముల మోహన్‌కుమార్ ఉన్నారు. ఆయన ప్రాథమిక విద్య 7వ తరగతి వరకు పట్వారిగూడెం ప్రాథమిక పాఠశాలలో సాగింది. అనంతరం అశ్వారావుపేటలోని వసతిగృహంలో ఉంటూ 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ పాఠశాలలో చదివారు. ఇంటర్, డిగ్రీ సత్తుపల్లిలోని ప్రభుత్వజూనియర్, డిగ్రీ కళాశాలల్లో సాగింది. డిగ్రీ అనంతరం ఉన్నత చదవులను ఉస్మానియా యూనివర్శిటిలో చదివి అక్కడే ఐపిఎస్ చదవాలనే ఆకాంక్ష బలంగా నాటుకుపోవడంతో ఆ దిశగా పరుగులు వేశారు.

తొలి ప్రయత్నంలోనే సఫలీకృతం…

శ్రీరాముల మోహన్‌కుమార్ ఐపిఎస్ చదవాలనే లక్ష్యం తొలి ప్రయత్నంలోనే సఫలీకృతమైంది. 1995లో ఎస్సై ఎంట్రన్స్ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించి హైదరాబాద్ ఓల్డ్ సిటిలోని చార్మినార్ పరిధిలో ఎస్సైగా బాథ్యతలు స్వీకరించారు. ఆనాటి నుంచి నేటి వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎస్సైగా శాంతి భద్రతల పరిరక్షణలో సమర్ధవంతంగా వ్యవహరించడంలో టాస్క్‌ఫోర్స్ సీఐగా, పంజాగుట్ట సీఐగా పదోన్నతి పొందారు. అనతికాలంలోనే ఆయన మరిన్ని విజయాలు సాధించిన సమయంలో కరోనా ప్రభావం మొదలైంది. ఆ సమయంలోనే కరోనా ప్రభావం మరింత తీవ్రంగా ఉన్న సూర్యపేటలో మోహన్‌కుమార్ సేవలను గుర్తించిన ఉన్నతాధికారులు అప్పటికే ఆయనకు సూర్యపేట డిఎస్పీగా పదోన్నతి కల్పించి, అక్కడకు పంపారు. ఓ పక్క కరోనా.. మరో పక్క ఆయన విధులను సమర్ధవంతంగానే నిర్వహిస్తూ ఆ ప్రాంత ప్రజల మన్ననలు సైతం పొందారు. ఆయన పనిచేస్తున్న కాలంలో యూనియన్ హోం మినిస్టర్ మోడల్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఎన్ ఇన్విస్టిగేషన్, సేవాపతకం, ఉత్కృష్ఠ సేవా పథకంతో పాటు క్యాష్ రికార్డులు, జీఎస్‌పి, ఎస్‌ఎస్‌ఈలు కలిపి మొత్తం 516 రికార్డులు దక్కించుకున్న పోలీస్ అధికారిగా గుర్తింపు పొందారు.

ఎస్సై స్థాయి నుంచి సీఐ, డిఎస్పీ ఇలా అంచలంచెలుగా ఎదుగుతూ విధి నిర్వహణలో తనదైన ముద్ర వేసుక్ను మోహన్‌కుమార్‌ను పదవులు వెతుక్కుంటూ వచ్చాయనే చెప్పాలి. వివిధ హోదాల్లో పనిచేసి పోలీస్ వృత్తిలో శాంతి భద్రతల పరిరక్షణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మోహన్‌కుమార్‌కు తాజాగా అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ హోదా కూడా దక్కింది. ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతంలో పుట్టి పెరిగి చివరకు నగర స్థాయిలో ఓ పోలీస్ ఉన్నతాధికారిగా విధులు నిర్వహించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యకమవుతున్నాయి.

ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖలో అధికారులను గుర్తిస్తుందనడానికి ఇదో మచ్చుతునకగా చెప్పవచ్చు. ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి శక్తి సామర్ధ్యాలను గుర్తించి ఇలాంటి ఉన్నత పదవి కల్పించడం పట్ల మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావులతో పాటు జట్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దొడ్డాకుల రాజేశ్వరరావుతో పాటు పలువురు ప్రముఖులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తుండగా మరో పక్క గ్రామంలోని తోటి స్నేహితులు, గ్రామస్థులు సంబరాలు చేసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News