Tuesday, April 30, 2024

ఆ సమయంలో కన్నీళ్లొచ్చాయి.. గడ్డకట్టే మంచులోనూ రాహుల్ ప్రసంగం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గడ్డకట్టే చలిలో భారత్ జోడో యాత్ర ముగింపు సభ సోమవారం జరిగింది. ఒకవైపు మంచు కురుస్తున్నా లెక్క చేయకుండా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసంగాన్ని కొనసాగించారు. ముగింపు సభలో భాగంగా జమ్ముకశ్మీర్ లోని శ్రీనగర్‌లో లాల్‌చౌక్‌లో జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూఏ ఈ పాదయాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. “ప్రజల సహకారం చూసి నాకు కళ్ల వెంట నీరు వచ్చింది. ఒక దశలో యాత్ర పూర్తి చేయగలనా అనుకున్నా.. చలిని లెక్క చేయకుండా ప్రజలు సభకు హాజరయ్యారు. వారి సహకారం లేకుండా ఏ పనీ సాకారం కాదు. పాదయాత్రలో అన్నివర్గాల ప్రజలు , మహిళలు తమ బాధలు నాతో పంచుకున్నారు. ఈ పాదయాత్ర నాకెన్నో పాఠాలు నేర్పింది. ప్రజల దీనస్థితి చూసే టీషర్టు తోనే యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాను. యాత్రలో భాగంగా ఓ రోజు నలుగురు చిన్నారులు నావద్దకు వచ్చారు.

వారు యాచకులు.. వారి ఒంటిపై దుస్తులు కూడా లేవు. వారు చలిలో వణికి పోతున్నారు. నాకు తెలిసి వారికి తగిన ఆహారం కూడా ఉండదు. వారు జాకెట్స్, స్వెట్టర్లు వేసుకోలేదు. అప్పుడే అనుకున్నా నేను కూడా వేసుకోకూడదని ” అని వెల్లడించారు. కశ్మీర్‌లో తన పాదయాత్ర గురించి మాట్లాడుతూ ‘భయం లేకుండా జీవించడాన్ని నా కుటుంబం నుంచి నేర్చుకున్నాను. భయపడుతూ బతికితే అది జీవితమే కాదు. కశ్మీర్‌కు కాలినడకన కాకుండా వాహనంలో వెళ్లమని నాకు భద్రతా సిబ్బంది చెప్పారు. కాలినడకన వెళ్తే మీపై గ్రనేడ్లు విసిరే అవకాశం ఉందని చెప్పారు.

కానీ నేను మాత్రం నా తెల్లటి టీషర్టును ఎరుపు రంగులో మార్చాలనుకునే వారికి అవకాశం ఇవ్వాలనుకున్నాను. ఇక్కడ నేను ఊహించినట్లే జరిగింది. ఇక్కడి ప్రజలు నాకు గ్రనేడ్లు ఇవ్వలేదు.ప్రేమను మాత్రమే పంచారు. ’ అని అన్నారు. అలాగే కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. దేశ వ్యాప్తంగా 145 రోజుల పాటు జోడో యాత్ర సాగింది. తమిళనాడు నుంచి కశ్మీర్ వరకు ఈ యాత్రను కొనసాగించారు. ఈ ముగింపు సభలో ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గేతోపాటు కశ్మీరీ అగ్రనేతలు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News