Friday, May 3, 2024

చాదర్‌ఘాట్‌లో కుంగిన రోడ్డు.. తప్పిన పెనుప్రమాదం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్ : చాదర్ ఘాట్ ప్రధాన రహదారి ఒక్కసారిగా కుంగిపోయింది రోడ్డు మధ్యలో భారీ గుంత ఏర్పడింది. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ సమయంలో ఎక్కువగా ట్రాఫిక్ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే గోషామహల్, హిమాయత్ నగర్ లలో రోడ్లు కుంగిన సంఘటనలు మరువక ముందే తాజాగా ఎంజిబిఎస్ -చాదర్ ఘాట్ ప్రధాన రహదారి కుంగి గుంత ఏర్పడడంతో నగర ప్రయాణికులను కలవరపాటుకు గురిచేస్తోంది. చాదర్‌ఘాట్ పోలీసు స్టేషన్‌కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని భారీకెట్లను ఏర్పాటు చేశారు.

ఘటన స్థలాన్ని మలక్‌పేట్ ఎమ్మెల్యే బలాల సందర్శించి ఘటనపై ఆరా తీశారు. రోడ్డు కుంగి గుంత పడిన ప్రదేశంలో 20 పీట్ల లోతులో 1100 ఎంఎం డగయా సీవరేజీ పైపు లైన్ ఉందని తెలిపిన జలమండలి అధికారులు కింద వైపు పైప్‌లైన్ దెబ్బతిన్నడంతో వాటర్ లీకేజై గుంత ఏర్పడి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే రోడ్డును పూర్తిగా తవ్విన తర్వాతే ఘటనకు గల కారణాలు తెలిసే అవకాశం ఉందన్నారు. ఇటీవల నగరంలో ఈ లాంటి ఘటనలు తరుచు చోటు చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. నగరంలో డ్రైనేజీ, నాలాలు ఎప్పుడో నిర్మించినవి కావడంతోనే ఈ సమస్య ఏర్పడుతున్నట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News