ఉపాధి పనుల పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
హైదరాబాద్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. శనివారం పాలకుర్తి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడానికి వెళుతూ కొడకండ్ల మండలం రామన్నగూడెం వద్ద రోడ్డుకు ఇరువైపులా మొక్కలకు పాదులు తవ్వుతూ, పిచ్చి మొక్కలను తొలగిస్తున్న ఉపాధి హామీ కూలీలతో మంత్రి ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఎండాకాలంలో ఉపాధి హామీ పనులపై ఆరా తీశారు. ఎండలు మండుతున్న సమయంలో పనులు చేయవద్దని ఉదయం, సాయంత్రం మాత్రమే పని చేయాలని కూలీలకు సూచించారు. నియోజకవర్గంలో కూలీలకు పనులు కల్పిస్తూ ఉపాధి అందేలాగా చూడటమే ఉపాధి హామీ పథకం లక్ష్యమని వివరించారు. మండుటెండల్లో పనిచేయవద్దని, అనారోగ్యానికి గురి కావద్దని కోరారు. కూలీలకు అన్ని సదుపాయాలు సజావుగా అందించాలని మంత్రి సంబంధిత ఉద్యోగులను అదేశించారు.