బొకారో : ఝార్ఖండ్ లోని బొకారో జిల్లా ఖేట్కో గ్రామంలో మొహర్రం వేడుకల సందర్భంగా విషాద సంఘటన జరిగింది. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో తాజియా ఊరేగిస్తుండగా హైటెన్షన్ కరెంట్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో పదిమంది గాయపడ్డారు. రాష్ట్ర రాజధాని రాంచీకి 80 కిమీ దూరంలో ఈ ప్రమాదం జరిగింది. 11000 వోల్టుల విద్యుత్ ఉన్న హైటెన్షన్ తీగలకు మతపరమైన తాజిగా తగలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని బొకారో పోలీస్ సూపరింటెండెంట్ ప్రియదర్శి అలోక్ చెప్పారు.
ఈ ప్రమాదానికి గురైన వారినందరినీ సమీప ఆస్పత్రికి మొదట తరలించామని, తరువాత బొకారో జనరల్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతున్నవారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మృతులు సజీద్ అన్సారీ (18), అషిఫ్ రజా (21), గులామ్ హుస్సేన్ (19), ఇనాముల్ రాబ్ (34)గా గుర్తించారు. జనరల్ ఆస్పత్రిలో ప్రస్తుతం ఏడుగురు చికిత్సపొందుతున్నారని వారి పరిస్థితి నిలకడగా ఉందని బెర్మో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సతీష్ చంద్ర ఝా తెలిపారు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. జిల్లా అధికార యంత్రాంగం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నవారు వేగంగా కోలుకోవాలని ఆయన అభిలషించారు. ఝార్ఖండ్ ఎక్సయిజ్ శాఖ మంత్రి బేబీ దేవి కూడా ఆస్పత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు.