జాబిల్లి : చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ నుంచి విడిపోయి తనను అంటిపెట్టుకుని ఉన్న సౌర రెక్కలు విచ్చుకోగా ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లిపై అన్వేషణల డ్యూటీలో దిగింది. ఇప్పుడు ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై మనం ఖరారు చేసుకున్న శివశక్తి స్థలి వద్ద సంచరిస్తోందని ఈ క్రమంలో ఈ దృశ్యాలతో కూడిన వీడియోను బెంగళూరులోని ఇస్రో కమాండ్ సెంటర్ మీడియాకు వెలువరించింది. చంద్రుడి దక్షిణ ధృవంపై వ్యోమనౌక విజయవంతంగా దిగిన తరువాత పగటి వేళను క్షణమైనా వృధా చేయకుండా రోవర్ పరిశోధనలకు రంగం సిద్ధం అయింది.
వ్యోమనౌక దిగిన శివశక్తి ప్రాంతం అంతా ఇప్పుడు రోవర్ కలియతిరగడం , అక్కడి లోగుట్టును పసికట్టేందుకు అన్వేషణ సాగించడం వంటి ఘట్టాలను ల్యాండర్‌పై అమర్చి ఉన్న అత్యంత శక్తివంతమైన కెమెరాల నుంచి చిత్రీకరణ అయింది. చంద్రుడి ఉపరితలాన్ని తాకగానే నెమ్మదిగా కదిలిన రోవర్ తరువాత లోయలు గుంతల అపరిచిత చంద్రుడి ఉపరితలంపై కదిలిన దశకు చెందిన 40 సెకండ్ల వీడియో ఇప్పుడు ఇస్రో ద్వారా భారత జాతికి అందింది. రోవర్ కదలాడి ప్రాంతంలో చక్రాల ముద్రలు, పక్కనే ల్యాండర్ వంటివి ఈ వీడియోలో పొందుపర్చి ఉన్నాయి.
పిల్లలు జారుడు బండ మీది నుంచి జారుకున్న రీతిలో ల్యాండర్ నుంచి రోవర్ ముందుగా ముందుకు కదిలింది. ప్రధాని మోడీ చంద్రయాన్ వ్యోమనౌక చేరిన ప్రాంతానికి శివశక్తి పాయింట్ అని పేరు పెట్టడంతో ఇస్రో వెలువరించిన ప్రకటనలో శివశక్తి స్థలిలో చంద్రయాన్ రోవర్ తిరిగినట్లు తెలిపారు. ల్యాండర్ నుంచి విడిపోయిన తరువాత రోవర్ ముందుగా ఎనిమిది మీటర్ల మేర అడుగులు వేసింది. ఇక్కడి ఖనిజాలు, మూలకాలు, జలవనరుల అన్వేషణ సంబంధిత శాస్త్రీయ పరిశోధనలకు అంకురార్పణ జరిగింది. జాబిల్లి ఓ వింత.
ఇందులో దక్షిణ ధృవం ఇంతవరకూ ఇతరులెవ్వరూ కనుగొనని చంద్రుడి మరో వైపు . ఇక్కడి పలు రహస్యాల ఛేదనకు రోవర్ ప్రజ్ఞాన్ విక్రమ్ నుంచి విడిపోయి ముందుకు మరింత ప్రజ్ఞానవంతంగా సాగిందని ఇస్రో తన ప్రకటనలో తెలిపింది. చంద్రుడిపై పర్చుకుని ఉండే పగటిరోజుల్లోని సూర్యకాంతిని తీసుకుంటూ విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు నేలమీది 14 రోజులకు సమానమైన చంద్రుడి ఒక్కరోజు పగటిపూట కాంతితోనే పనిచేస్తాయి. ఈ దశలో సాగే పరీక్షలు, తద్వారా అందే సమాచారమే చంద్రయాన్‌కు అత్యంత కీలకమైన విజయంగా నిలుస్తుంది.