Sunday, May 12, 2024

జైలులో సిఎం కేజ్రీవాల్ ఆఫీస్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాలను జైలుకు పంపించిన పక్షంలో జైలులో నుంచి ఆయన ప్రభుత్వం నడవడానికి ఆఫీస్ ఏర్పాటు కోసం అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ శనివారం ప్రకటించారు. ఆప్‌లో కేజ్రీవాల్ స్థానాన్ని ఎవరూ తీసుకోజాలరని కూడా ఆయన స్పష్టం చేశారు. ‘జైలులో నుంచి ప్రభుత్వాన్ని నడపరాదని ఎక్కడా రాసి లేదు’ అని మాన్ ‘పిటిఐ వీడియోల’కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. ఎక్సైజ్ విధానం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) అరెస్టు చేయడం గురించి, ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపితే ఆయన ప్రభుత్వాన్ని

ఎలా నడపగలరని అడిగిన ప్రశ్నకు మాన్ పై విధంగా సమాధానం ఇచ్చారు. కేజ్రీవాల్‌ను ఈ నెల 28 వరకు ఇడి కస్టడీకి పంపిన తరువాత ఆయన రాజీనామా చేయాలని బిజెపి డిమాండ్ చేసింది. ‘దోషిగా నిర్ధారితం అయ్యే వరకు ఆయన జైలులో నుంచి పని చేయవచ్చునని చట్టం చెబుతోంది. జైలులో ఆఫీస్ ఏర్పాటు చేయడానికి, ప్రభుత్వం పని చేయడానికి సుప్రీం కోర్టు. హైకోర్టు నుంచి అనుమతి కోరతాం’ అని మాన్ తెలిపారు. కేజ్రీవాల్ అవినీతి నిరోధక ఉద్యమంలో నుంచి పార్టీని సృష్టించినందున, ఆయన సీనియర్ వ్యవస్థాపక సభ్యుడు అయినందున ఆప్‌లో ఆయన స్థానాన్ని ఎవరూ తీసుకోజాలరని మాన్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News