న్యూయార్క్ : ఉత్తర అమెరికాలో సోమవారం (ఏప్రిల్ 8) నాడు కనిపించే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని సందర్శించడానికి అక్కడి జనం విశేషమైన ఆసక్తి చూపిస్తున్నారు. మెక్సికో లోని పసిఫిక్ తీరంలో ఈ సూర్యగ్రహణం కనపించనున్నది. ఇది కెనడా నుండి నిష్క్రమించే ముందు టెక్సాస్‌తోపాటు 14 ఇతర అమెరికా రాష్ట్రాలను దాటనుంది.2017లో సంభవించిన సంపూర్ణ సూర్యగ్రహణం కంటే ఇదిదాదాపు రెండు రెట్లు ఎక్కువ కాలం ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికా లోని పలు మార్కెట్లతోపాటు టూరిజం విభాగం గ్రహణ వీక్షకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి.
సౌత్‌వెస్ట్, డెల్టా వంటి విమాన సంస్థలు ఈ గ్రహణాన్ని వీక్షించడానికి విమాన మార్గాలను ప్రకటించాయి. అలాగే పలు మార్కెట్లలో పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఎక్లిప్స్ సేఫ్టీ గ్లాసెస్ అమ్మకానికి అందుబాటులో ఉంచారు. వివిధ రంగుల టీషర్టులు, ఖగోళ సావనీర్లు విక్రయిస్తున్నారు. 2017లో అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు అనేక కంపెనీలు దానిని ఆదాయ మార్గంగా మార్చుకున్నాయి. వాటిలో క్రీస్పీ క్రీమ్ కూడా ఉంది. షార్లెట్, నార్త్ కరోలినాకు చెందిన ఈ సంస్థ 2017 సూర్యగ్రహణ సందర్భంగా పరిమిత ఎడిషన్ చాక్లెట్ గ్లేజ్డ్ డోనట్‌లను విడుదల చేసింది.