Wednesday, September 17, 2025

వలసలు, విదేశీయుల సంబంధిత సేవల క్రమబద్ధీకరణకు బిల్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలోకి ప్రవేశం, నిష్క్రమణ, బస సహా విదేశీయులు, వలసదారులకు సంబంధించిన వివిధ సేవల క్రమబద్ధీకరణను కోరుతున్న బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే. బిల్లు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమైనదని అంటూ ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. 2025 వలస, విదేశీయుల బిల్లును తీసుకువచ్చే శాసనపరమైన సమర్థత పార్లమెంట్‌కు లేదన్న అభిప్రాయాలను హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ అంశంపై శాసనాలను తీసుకువచ్చేందుకు కేంద్ర జాబితా కింద అన్ని హక్కులూ కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయని స్పష్టం చేశారు. పర్యాటకులు భారత్‌కు రావడానికి స్వాగతనీయులు అని మంత్రి స్పష్టం చేస్తూ, దేశ శాంతి, సార్వభౌమత్వం యథాతథంగా కొనసాగేలా చూడడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు.

బిల్లును ప్రవేశపెట్టే దశలో మనీష్ తివారీ (కాంగ్రెస్) అభ్యంతరం వ్యక్తం చేస్తూ, రాజ్యాంగంలోని అనేక నిబంధనలకు, వివిధ చట్టాలకు విరుద్ధమైనదని ఆరోపించారు. ప్రాథమిక హక్కుల సూత్రాన్ని బిల్లు ఉల్లంఘిస్తున్నదని, అధికార పక్ష సిద్ధాంతంతో ఏకీభవించనివారి ప్రవేశాన్ని నిరాకరించేందుకు ప్రతిపాదిత చట్టంలోని నిబంధనలను ప్రభుత్వం ఉపయోగించవచ్చునని తివారీ ఆరోపించారు. వివిధ రంగాల్లో విదేశాల నుంచి ప్రతిభావంతుల రాకను ప్రతిపాదిత చట్టం అడ్డుకుంటుందని టిఎంసి ఎంపి సౌగతారాయ్ అన్నారు. మంత్రి నిత్యానంద రాయ్ బిల్లును లాంఛనంగా ప్రవేశపెట్టే ముందు మాట్లాడుతూ, దేశంలో వలసలకు, విదేశీయులకు సంబంధించిన రకరకాల నిబంధనలను సరిదిద్దడం ముసాయిదా బిల్లు లక్షమని తెలిపారు.

ప్రస్తుతతం భారత్‌లోకి విదేశీయుల ప్రవేశం, బస, దేశం నుంచి నిష్క్రమణకు 1939 విదేశీయుల నమోదు చట్టం, 1946 విదేశీయుల చట్టం వర్తిస్తున్నాయి. విదేశీయులకు అన్ని కేటగరీల వీసాలను విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాలు లేదా పోస్ట్‌లు భౌతిక లేదా స్టిక్కర్ రూపంలో మంజూరు చేస్తుండగా, వలస బ్యూరో (బిఒఐ 167 దేశాల ప్రజలకు ఏడు కేటగరీల కింద ఎలక్ట్రానిక్ వీసాలు మంజూరు చేస్తున్నది. భారత్‌లో విదేశీయుల మకాంను, రవాణాను బిఒఐ, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు క్రమబద్ధం చేస్తున్నాయి. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ డేటా ప్రకారం, 2023 ఏప్రిల్ 1, 2024 మార్చి 31 మధ్య 9840321 మంది విదేశీయులు భారత్‌ను సందర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News