తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్దదైన వర్ధమాన మహావీరుడి శిల్పాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సిఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్, సభ్యులు అహూబిలం కరుణాకర్, సామలేటి మహేష్ ఇచ్చిన సమాచారం మేరకు తాము బుధవారం సిద్దిపేట జిల్లా, మండల కేంద్రం నంగునూరులోని చిన్న కొండపైన ఉన్న జైన శిల్పాన్ని పరిశీలించినట్లు వెల్లడించారు.దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తు కలిగి, మూడున్నర అడుగుల వెడల్పుగల కాయోత్సర్గాసనంలో నిలబడి, మోకాళ్ల వరకు భూమిలోకి కూరుకుపోయిన మహావీర శిల్పం, తలపై ఉష్టీష చిహ్నంతో క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్ద రాష్ట్రకూటుల కాలపు జైన తీర్థంకర ప్రతిమాలక్షణానికి అద్దం పడుతుందని ఆయన తెలిపారు.
కొండకు దిగువన చుట్టూ ఉన్న ఇటుకరాతి శకలాలు, తుప్పల్లో ఒక రాతి స్థంభంపై పద్మాసనంలో కూర్చొని ఉన్న మహావీరుని శిల్పం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న జైన తీర్థంకరుల శిల్పాలు, నంగునూరు 1100 సంవత్సరాల కాలం నాటి జైన కేంద్రమని, అక్కడొక జైనబసది ఉండేదని తెలియజేస్తున్నాయని ఆయన వివరించారు.ఎంతో అరుదైన ఈ అపురూప జైనవిగ్రహం చుట్టూ గల రాతిని తొలగిస్తున్నారని, తద్వారా 11వ శాతాబ్దాల కాలం నాటి చారిత్రక ప్రాముఖ్యతగల శిల్పానికి ప్రమాదం ఏర్పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచైనా అక్కడ జరుగుతున్న క్వారీ పనులను నిలిపివేసి ఆ విగ్రహాన్ని కాపాడుకోవాలని నంగునూరు గ్రామ ప్రజలకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. జైన విగ్రహాన్ని పరిశీలించిన వారిలో తనతో పాటు అహూబిలం కరుణాకర్, పవన్, ప్రముఖ శిల్పి బి.సుధాకర్ సింగ్ పాల్గొన్నట్లు తెలిపారు.