ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన ఖర్మ మాకేం
పట్టలేదు బంగ్లాదేశ్ మాదిరిగా ప్రజలే
ఉద్యమిస్తారు కంచభూములపై ప్రధాని
నరేంద్ర మోడీ మౌనమెందుకు? : కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన తమకు లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అ న్నారు.“ఈ ప్రభుత్వాన్ని పడగొ ట్టే ఖర్మ మాకేం పట్టలేదు … బం గ్లాదేశ్ లాగా ప్రజలే కూలగొడతారు” అంటూ సంచల న వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఎంఎల్‌ఎ కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యం అని, ప్రజలు తమ దగ్గరకు వచ్చి ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తున్నారని మాత్రమే చెప్పారని అన్నారు. కా్ంర గెస్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించాలనే ప్రజలే కోరుతున్నారని, సమయం వచ్చినప్పుడు ప్రజలే కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారని అన్నారు. రేవంత్‌రెడ్డికి ధైర్యం ఉంటే భద్రత లేకుండా రాష్ట్రంలోని ఏ గ్రామానికైనా వెళ్లాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఐదేళ్లు అధికారంలో ఉండాలని తాము కోరుకుంటున్నామని, రేవంత్ రెడ్డే ఐదేళ్లు సిఎంగా ఉండాలని ఉద్ఘాటించారు. అప్పుడే రాష్ట్రంలో కాం గ్రెస్ మరో 20 ఏళ్ల పాటు అధికారంలోకి రాదని విమర్శించారు. ప్రజలకు కూడా అన్ని విషయాలు అర్థం కావాలని అన్నారు.
పార్టీ ఫిరాయింపులను మెదలు పెట్టిందే కాంగ్రెస్ అని ఆరోపించారు. ఆ యారాం గయారాం సంస్కృతిని ఇందిరాగాంధీ తీసుకువచ్చారని గుర్తుచేశారు. పార్టీ మారిన ఎం ఎల్‌ఎలు ఎక్కడ ఉన్నారో వారికే తెలియటం లేదని ఎద్దేవా చేశారు. వారు ఏ పార్టీలో ఉన్నారని అడిగితే.. తనకేం తెలుసని కడియం శ్రీహరి అంటున్నారని.. ఆయన ఏ పార్టీలో ఉన్నారో అంత అ యోమయంగా ఉందని సెటైర్లు గుప్పించారు. తెలంగాణ భవన్‌లో గురువారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు డైరెక్షన్స్‌ను స్వాగతిస్తున్నామని అన్నారు. వందల ఎకరాల్లో పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరణ చేస్తారో రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పాలనటం సంతోషకరమని అన్నారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ తర్వాత ఇంకో సిఎం అయితే రాజీనామా చేసేవారని.. రేవంత్ రెడ్డి కాబట్టి దులుపుకుని పోతున్నారని విమర్శించారు.
ఇది హెచ్‌సియు విద్యార్థులు, ప్రొఫెసర్ల, పర్యావరణవేత్తల విజయం అని కెటిఆర్ అభివర్ణించారు. అధికార మదంతో విర్రవీగి రారాజులం, నియంతలం అని భావిస్తే అది పొరపాటు అని పేర్కొన్నా రు. గచ్చిబౌలి హెచ్‌సియు వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రజా స్వామ్యాన్ని కాపాడాయని, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలిగేలా జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. తమ వాదనను సమర్థిస్తూ నివేదికను అందజేసిన కేంద్ర సాధికార సంస్థకు కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. న్యాయస్థానంలో విషయం తేలేదాక కంచ గచ్చిబౌలి భూమిని తాకట్టు పెట్టడానికి, లీజుకు ఇవ్వరాదని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ తన రిపోర్టులో స్పష్టంగా పేర్కొందని చెప్పారు. ఆర్థిక అవకవతవలపై ఏజెన్సీలతో విచారణ చేయాలని సుప్రీంకోర్టుకు ఇచ్చినా నివేదికలో తెలిపిందని అన్నారు.
ప్రధాని మోదీ స్పందించి విచారణకు ఆదేశించాలి
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించాలని కెటిఆర్ అన్నారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మోదీకి కూడా కాంగ్రెస్ కుంభకోణంలో వాటా ఉందని నమ్మాల్సి వస్తుందని తెలిపారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు జడ్డితో లేదా సిబిఐ, సివిసి లేదా ఇతర విచారణ సంస్థలతో విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ డైలాగులు కొడితే సరిపోదని… విచారణ జరిపించాలని కోరారు. మోదీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని అన్నారు. తెలంగాణలో ఆర్‌ఆర్ టాక్స్ వసూళ్లు చేస్తున్నారని ఏడాది క్రితం మోదీ అన్నారని గుర్తుచేశారు. ఏడాదికి ఒకసారి మాత్రమే కాంగ్రెస్ సర్కార్‌పై మోదీ మాట్లాడుతున్నారని అన్నారు. ప్రవచనాలు చెబుతున్న మోదీ..
రేవంత్ ప్రభుత్వంపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఆర్‌ఆర్ ట్యాక్స్ అని మాట్లాడిన ఏడాది తర్వాత హెచ్‌సియులో ఏదో జరుగుతుందని హర్యానాలో మాట్లాడారని పేర్కొన్నారు. రూ. 10 వేల కోట్ల కుంభకోణం బయటకు రావాలంటే విచారణ జరపాల్సిందేనని పేర్కొన్నారు. హెచ్‌సియులో ఏ సమస్య ఉన్నా వస్తానని రాహుల్ గాంధీ గతంలో చెప్పారని.. ఇప్పుడు ఎక్కడ ఉన్నారని నిలదీశారు. ఢిల్లీకి మూటలు వెళ్తున్నాయని, అందుకే హెచ్‌సియు వ్యవహారంలో రాహుల్ గాంధీ నోరు మెదపడం లేదని ఆరోపించారు. చెరువును తాకట్టు పెట్టిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని ఆరోపించారు. ఏఐ వీడియోలు లేవన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద కూడా రేవంత్ రెడ్డి కేసులు పెడతారా..? అని అడిగారు. బిజెపికి చిత్తశుద్ధి ఉందా.. లేదా..? అనే దానిపై నెలాఖరు వరకు ఎదురుచూస్తామని, నెలాఖరులో బిఆర్‌ఎస్ సమావేశం తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్దకు వెళ్లి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అప్పటికీ స్పందించకపోతే ప్రజాక్షేత్రంలో బిజెపికి ఎండగడతామని అన్నారు.
మూటల వేట సిఎంది…
బలవుతున్న అధికారులు
మూటల వేట సిఎందే కానీ.. సిఎస్, అధికారులు బలవుతున్నారని కెటిఆర్ అన్నారు. ఇప్పుడు ఐఏఎస్, అటవీ అధికారుల వంతు అయ్యిందని పేర్కొన్నారు. ఇతర అధికారులూ జాగ్రత్తగా ఉం డాలని సూచించారు. కొందరు పోలీసులు రేవంత్‌రెడ్డి సైన్యంలా వ్యవహరిస్తున్నారని, ఇష్టానుసారం కేసులు పెట్టిన వారిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. రేవంత్‌కి సొంత సైన్యంలా పనిచేస్తోన్న కొంతమంది పోలీస్ అధికారులు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. సిఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బయటకు వచ్చి ఈ వ్యవహారంలో వివరణ ఇవ్వాలని అన్నారు. ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారంలో అధికారులను తాను బలిపశువులను చేయలేదని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో అధికారులు బలిపశువులు అవుతున్నారని విమర్శించారు. ఫార్ములా ఈ రేసులో మంత్రిగా విధాన నిర్ణయాలు తీసుకున్నానని తానే చెప్పానని, అంతేకానీ అధికారులను బలి చేయలేదని తెలిపారు. ఫార్ములా ఈ రేసులో అభ్యంతరం ఉంటే తాను బాధ్యత తీసుకుంటానని తెలిపారు.