బోర్డు తిప్పేసిన విప్స్ వ్యాలెట్
కంపెనీ ఉమ్మడి నల్లగొండ
జిల్లాలో రూ.500 కోట్ల వరకు
సంస్థలో పెట్టుబడులు
లబోదిబోమంటూ పోలీసులను
ఆశ్రయించిన బాధితులు
మహారాష్ట్రలోని పుణెకు చెందిన
వినోద్ ఖుటే సిఈఓగా నడిచిన
సంస్థ నల్లగొండ, చౌటుప్పల్‌లో
బ్రాంచీల ఏర్పాటు కొన్నాళ్ళు
అధికవడ్డీ ఇచ్చిన కంపెనీ..
ఆ తర్వాత అసలుకే ఎసరు
మన తెలంగాణ/నల్లగొండ బ్యూరో: మొబైల్‌షాపు నడుపుకునేవారు..పాన్‌డబ్బా నిర్వాహకు లు.. టైలరింగ్ చేసుకునేవారు.. చిరు ఉద్యోగులు.. ప్రభుత్వ ఉద్యోగులు.. వ్యాపారస్తులు.. వీరికితోడు కొందరు రాజకీయ నాయకులు.. తి నీతినక డబ్బులు కూడబెట్టారు.. అధికవడ్డీ ఆశ కు పోయి అసలుకే ఎసరు తెచ్చుకున్నారు. ఆ సంస్థ కూడా కొన్నాళ్ళు అందరినీ నమ్మించిం ది.. పెట్టిన పెట్టుబడులకు 3రూపాయలు వడ్డీ చొప్పున వారి ఎకౌంట్లలో జమచేసింది. కొన్నినెలలు వేసి అందరినీ నమ్మించి ఒక్కసారే బోర్డు తిప్పేసింది. అధికవడ్డీ ఆశకు అమాయకులు బలైపోయి లబోదిబోమంటున్నారు. నల్లగొండ, చౌటుప్పల్‌తో పాటు పలుప్రాంతాల్లో బ్రాంచీలు ఓపెన్‌చేసి ఒక్కొక్కరి నుండి లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టించారు. ఉమ్మడినల్లగొండ జిల్లాలోనే 500కోట్ల రూపాయల వరకు నష్టపోయినట్లు బాధితులు చెపుతున్నారు.
పెట్టిన పె ట్టుబడులు రావని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు. విప్స్‌వ్యాలెట్ గ్రూపు ఆఫ్ కం పెనీ వేలమంది అమాయకులను రోడ్డున పడేసింది. వందలకోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించిన డైరెక్టర్లు ఇన్వెస్టర్లకు డబ్బులు ఇవ్వకపోగా వారిపై ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈపరిణామంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. విప్స్‌వ్యాలెట్‌లో పెట్టుబడి పెట్టిన బాధితుల్లో సగంమంది చిన్నబిజినెస్‌లు చేసుకుంటూనే పెట్టినట్లు చెపుతున్నారు. కొందరు అధికవడ్డీలు వస్తే ఇళ్ళు కట్టుకోవడం.. మరికొందరు పిల్లల పెండ్లిల్లు చేయాలనే ఆలోచనతో ఉన్నడబ్బులు పెట్టుబడులుగా పెట్టి నష్టపోయామని అంటున్నారు. దురాశ దుఖాఃనికి చేటు అనే సామెతను మరోసారి గుర్తు చేశారు.
2016లో సంస్థ ప్రారంభం..
మహారాష్ట్రలోని పూణేకు చెందిన వినోద్ ఖుటే ఫౌండర్ కం సిఈఓగా విప్స్ వ్యాలెట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ 2016(సుమారుగా)లో ప్రారంభమైంది. అప్పటి నుండి చిన్నచిన్నగా నడుస్తున్న కంపెనీ 2019సంవత్సరంలో నల్లగొండలో ఎంట్రీ ఇచ్చారు. సంస్థ డైరెక్టర్లుగా నల్లగొండకు చెందిన కే.ఎల్.ఎన్.రావు, అభిరుచి కర్రీపాయింట్ నడిపే గుమ్మల సత్యనారాయణలు నల్లగొండకు తీసుకువచ్చారు. విప్స్‌వ్యాలెట్ కంపెనీకి మంచి భవిష్యత్తు ఉంది.. అందులో పెట్టుబడులు పెడితే మీఅసలు డబ్బులు అలా ఉంటూనే నెలనెలా 3రూపాయల వడ్డీ మీఅకౌంట్లలో పడుతుంది.45రోజుల తర్వాత మీఅసలు డబ్బులు ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు.. అని నమ్మబలికారు. పరిచయస్తులతో మొదలైన పెట్టుబడులు నల్లగొండ పట్టణంలోని అందరితో పెట్టించారు. ముందుగా డబ్బులు పెట్టిన వారి అకౌంట్లలో అధికవడ్డీ పడటం.. వారిని చూసి ఇంకొకరు.. వాళ్ళను చూసి ఇంకొందరు అన్నట్లు ప్రతిఒక్కరూ విప్స్‌వ్యాలెట్‌లో పెట్టబడులు పెట్టారు.
కొందరు ఒక్కసారే లక్షలరూపాయలు పెట్టుబడి పెడితే.. మరికొందరు దశలవారీగా పెంచుకుంటూ పెట్టుబడులు పెట్టారు. పెట్టుబడులు పెట్టిన తొలినాళ్ళలో అంటే నాలుగైదు నెలలపాటు అధికవడ్డీ వారి ఎకౌంట్‌లలో విప్స్ సంస్థ నుండి జమ అయ్యాయి. వీరుకూడా వాటిని వాడుకుంటూపోయారు. ఆతర్వాత కొంతమొత్తంలో పెట్టబడులు పెంచుకుంటూ పోయారు. ఉమ్మడినల్లగొండ జిల్లాలోని వేలమంది ఇన్వెస్టర్ల నుండి 500కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు ఆసంస్థలో పెట్టి మోసపోయారు. కానీ 2023 సంవత్సరం నుండి వడ్డీ పడటం ఆగిపోయింది.. అసలుకే ఎసరు వచ్చింది. పెట్టిన పెట్టుబడులు లక్షల రూపాయలు ఇవ్వకుండానే బోర్డు తిప్పేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
బాధితులకంటే ముందు డైరెక్టర్లే పోలీసుల వద్దకు..
విప్స్‌వ్యాలెట్ సంస్థలో డబ్బులు పెట్టి నష్టపోయిన బాధితుల కంటే ముందుగా పెట్టుబడులు పెట్టించిన డైరెక్టర్లు తెలివిగా పోలీసులను ఆశ్రయించారు. సంస్థలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లుగా మానసికంగా వేధిస్తున్నారు.. చంపుతామని బెదిరిస్తున్నారు.. అంటూ నల్లగొండ రూరల్ పోలీసులను ఆశ్రయించారు. వందలకోట్ల రూపాయల వ్యవహారం కావడంతో రూరల్ పోలీసుల పంచాయతీ డిఎస్‌పి వద్దకు చేరింది. డైరెక్టర్లు, బాధితులు అంతా డిఎస్‌పి కార్యాలయానికి తరలివచ్చారు. పెట్టుబడులు పెట్టి నష్టపోయిన బాధితులు డైరెక్టర్లను నిలదీశారు. వారినుంచి ఎటువంటి సమాధానం లేకుండాపోయింది. అయితే పోలీసులు మాత్రం ఇప్పటివరకు బాధితుల నుండి ఎటువంటి ఫిర్యాదు అందలేదని, వారు ఫిర్యాదు చేస్తే కేసును పరిశీలిస్తామని చెపుతున్నారు.
25 లక్షలు పెట్టిన.. రూపాయి రాలేః కిరణ్‌కుమార్, బాధితుడు
అధికవడ్డీ ఆశకుపోయి విప్స్‌వ్యాలెట్ సంస్థలో 25లక్షల రూపాయలు 2023లో పెట్టుబడులు పెట్టిన.. ఇప్పటివరు రూపాయి కూడా రిటన్ రాలేదు.. నాది చిన్నమొబైల్ షాపు.. అదినడిస్తేనే కుటుంబం గడిచేది.. ఉన్న డబ్బులు అన్నీ అత్యాశకు పోయి పెట్టి వీధినపడ్డానని పట్టణంలోని రామగిరి సెంటర్‌లో విజయ మొబైల్‌షాపు యజమాని కిరణ్‌కుమార్ అంటున్నారు.
మూడునెలలు వడ్డీ ఇచ్చారు.. పెట్టినపెట్టుబడి పోయిందిః సత్తయ్య, బాధితుడు
నల్లగొండ పట్టణంలోని ఎన్‌జి కళాశాల సమీపంలో పాన్‌షాపు నడుపుకుంటా.. కొన్నేళ్ళ నుండి రూపాయి రూపాయి కూడబెట్టి దాచుకున్నా. 2023సంవత్సరంలో 18లక్షల రూపాయలు విప్స్‌వ్యాలెట్‌లో పెట్టిన.. నెలకు 56వేల రూపాయల చొప్పున మూడునెలలపాటు వడ్డీ ఇచ్చారు.. ఆతర్వాత నాఅసలు మొత్తం పోయింది.. అని పాన్‌షాపు నిర్వాహకుడు పున్న సత్తయ్య లబోదిబోమంటున్నారు.
50 లక్షలు పెట్టి నష్టపోయాః ఓగులాబీ లీడర్
నల్లగొండ పట్టణంలోని ఓగులాబీ లీడర్ కూడా విప్స్ వ్యాలెట్ సంస్థలో బాధితుడు అయ్యాడు. అందరిలాగే అధికవడ్డీ ఆశకుపోయి 7.50లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. చివరకు ఒక్కరూపాయి రాకుండానే నష్టపోయానని మాజీ కౌన్సిలర్, బిఆర్‌ఎస్ లీడర్ చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది.
టైలరింగ్ చేసుకుంటా.. ఇళ్ళు కట్టుకుందామనుకున్న డబ్బులు పెట్టినః టైలర్ రాంబాబు
నేను టైలరింగ్ చేసుకుంటా.. బట్టలు కుట్టి రూపాయిరూపాయి కూడబెట్టిన.. ఇళ్ళు కట్టుకుందామని దాచుకున్న.. విప్స్‌వ్యాలెట్‌లో పెట్టబడులు పెడితే భవిష్యత్తు ఉందని చెప్పడంతో ముందు కొంత పెట్టిన.. దశలవారీగా పెంచుకుంటూ పోయా.. 20లక్షల వరకు ఆసంస్థలో ఇన్వెస్ట్ చేసిన.. అన్నీ పోయినయి.. నాఆశలు చెదిరిపోయాయి.. అంటూ తిప్పర్తికి చెందిన బాధితుడు రెబ్బ రాంబాబు లబోదిబోమంటున్నాడు.