టెస్లా విస్తరణకు మస్క్ దూకుడు
న్యూయార్క్ : తనకు భారత్ అంటే అభిమానం అని, తాను ఈ ఏడాది చివరిలో భారతదేశ పర్యటనకు వెళ్లుతానని ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలన్ మస్క్ తెలిపారు. ఇండియాకు వెళ్లి రావాలనే ఆలోచన ఉందన్నారు. ఒక్క రోజు క్రితం ప్రధాని మోడీ మస్క్‌తో ఫోన్‌లో మాట్లాడారు. దీనిపై టెస్లా అధినేత స్పందించారు. మోడీతో మాట్లాడటం తనకు అపార సంతోషం కల్గించిందని తెలిపారు. చివరికి అంతరిక్షం వరకూ కూడా మస్క్ కార్యకలాపాలు విస్తరించుకుని ఉన్నాయి. ట్రంప్ 2 దశలో మస్క్‌కు ట్రంప్ అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. ఆయనను ట్రంప్ తమ అధికార యంత్రాంగంలో కీలక బాధ్యతల్లోకి తీసుకున్నారు. పైగా ప్రభుత్వ సమర్థత పెంపుదల, వ్యయంలో కోతకు సంబంధించిన విభాగానికి సారధిని చేశారు.
టెస్లా కంపెనీ అధినేత అయిన మస్క్ భారతదేశంలో పర్యటించే నేపథ్యంలో భారతదేశంతో ఆ సంస్థ వ్యాపారం , సాంకేతిక వినిమయం , ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ శక్తితో పనిచేసే వాహనాల అమ్మకాలకు భారతదేశంలో అవకాశాలు ఉంటాయి. ఎలన్ మస్క్ పెద్ద ఎత్తున భారతీయ మార్కెట్ లో విస్తరించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా ఇతర నగరాలలో టెస్లా కారు షోరూంల ఏర్పాటుకు , మరింతగా లావాదేవీల విస్తరణకు రంగం సిద్ధం అయింది. జనవరిలో ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు మస్క్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అప్పుడు ఇరువురు నడుమ పలు కీలక వ్యాపార విషయాలు ప్రస్తావనకు వచ్చాయి.