ఓ కసాయి తండ్రి తన కన్న కొడుకును రోకలి బండతో కొట్టి చంపేశాడు. ఈ విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఉమ్మడి రేగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… రేపాకపల్లి గ్రామానికి చెందిన కసం ఓదెలు (35) 108లో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పరకాల మండలానికి చెందిన కసం దేవితో 14 సంవత్సరాల క్రితం అతనికి వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. ఓదెలు తండ్రి మొండయ్య కొన్నేళ్లుగా కోడలి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఈ విషయమై గతంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టినా, అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇదే విషయంపై తండ్రి, కొడుకులకు తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో సోమవారం ఓదెలు తన పెళ్ళి రోజు సందర్భంగా రాత్రి 7 గంటల సమయంలో వేడుకలు చేసుకుంటు ఉండగా మాటామాటా పెరిగి తండ్రి, కొడుకులకు గొడవ జరిగింది.
వారి ఇంటి పక్కనున్న కురుమ లక్ష్మీనారాయణ తన ఇంటికి తీసుకెళ్ళి తండ్రి, కొడుకులను సర్దిచెప్పి గొడవను తగ్గించాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని ఎలాగైనా తన కొడుకు అడ్డు తొలగించాలని, తర్వాత కోడలిని దక్కించుకోవాలని దురుద్దేశంతో ఉన్నాడు. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో ఓదెలు తన ఇంటి ముందు వరండంలో పరుపుపై పడుకొని ఉండగా ఇదే సరైన సమయం అని భావించిన మొండయ్య దగ్గరలో ఉన్న రోకలిబండతో కొడుకు తలపై కొట్టగా తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందడంతో నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు. విషయం తెలుసుకున్న డిఎస్‌పి సంపత్‌రావు, చిట్యాల సిఐ మల్లేష్ యాదవ్‌తో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సందీప్‌కుమార్ తెలిపారు.