పహల్గా ఉగ్రదాడిలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన తరువాత కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతోంది. ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. రాష్ట్రమంతా జల్లెడపడుతున్నాయి. కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్న ఇద్దర్ని భద్రతా దళాలు శనివారం ఖైమోహ్ ప్రాంతంలో అరెస్టు చేశాయి. అయితే వారి పేర్లు, ఇతర వివరాలను భద్రతా సిబ్బంది వెల్లడించలేదు. కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని భద్రతా దళాలు ధ్వంసం చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారి స్థావరాల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
అయిదు ఎకె 47 రైఫిల్స్, ఎనిమిది ఎకె 47 మేగజైన్స్, పిస్తోలు, పిస్తోలు మేగజైన్, ఎకె 47 660 తూటాలు, మందుగుండు, ఎం4 మందుగుండు 50 తూటాలు, స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రస్థావరాలు ఉన్నాయని నిర్దిష్ట నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఉత్తర కశ్మీర్ జిల్లా సెడోరి నాలా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు సోదాలు నిర్వహించాయి. ఈ ప్రాంతంలో ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించాలనే లక్షంతో ముష్కరులు కుట్ర పన్నుతున్నారన్న సమాచారం వచ్చిందని, దీంతో సైన్యం వారి స్థావరాలను ధ్వంసం చేయడం ఉగ్రవేటలో మరో ముందడుగుగా పేర్కొన్నారు.