Sunday, May 18, 2025

తెలంగాణే రోల్ మోడల్

- Advertisement -
- Advertisement -

సమాఖ్య స్ఫూర్తితో కలిసి పని చేయాలి అన్ని రాష్ట్రాలకు
నిపుణుల కమిటీని పంపాలి కేంద్ర మంత్రులతో
కమిటీ ఏర్పాటు చేయాలి కులగణనలో మేం రాజకీయాలకు
తావు ఇవ్వలేదు ప్రజాసంఘాలను సంప్రదించి ప్రశ్నపత్రం
తయారు చేశాం అన్నివర్గాల నుంచి పకడ్బందీగా
సమాచారం సేకరించాం మా అనుభవాన్ని కేంద్రంతో
పంచుకుంటాం కులగణనను ఎప్పుడు ప్రారంభిస్తారో.. ఎప్పుడు
ముగిస్తారో చెప్పాలి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
నేడు ఢిల్లీకి సిఎం కులగణనపై సిడబ్లూసి భేటీకి హాజరు

మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్రం కులగణన చేస్తే తెలంగాణ మోడల్‌ను పరిగణలో కి తీసుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి కేంద్రాని కి విజ్ఞప్తి -చేశారు. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాలని ఆయన సూ చించారు. ప్రతి రాష్ట్రంతో మాట్లాడి ఆయా ప్రభుత్వాల సలహాలు, సూచనలు తీసుకోవాలని కేంద్రానికి సిఎం రేవంత్ రెడ్డి సూచించా రు. జూబ్లీహిల్స్‌లోని సిఎం రేవంత్‌రెడ్డి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ కులగణన సమాజానికి ఎక్స్‌రే లాంటిదని రాహుల్ అన్నారని గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాలకు నిపుణుల కమిటీ పంపాలని, కులగణనలో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేయాలని ఆయన ఆకాంక్షించా రు. ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకా లు రూపొందించాలని సిఎం రేవంత్‌రెడ్డి డి మాండ్ చేశారు. కులగణన పూర్తయ్యాక ఏం చేస్తారో కేంద్రం స్పష్టంగా చెప్పాలని కోరా రు. కులగణన చేసేందుకు కేంద్రం అంగీకరించిందని, ఈ విషయంలో మొదట రాహుల్‌కు అభినందనలు చెప్పాలన్నారు.

కులగణన కోరుతూ రాహుల్ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని, దీనిపై రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. కులగణన విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాహుల్ గాంధీ విజయమని సిఎం రేవంత్ పేర్కొన్నారు. జనగణనలో కులగణన చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారని, ఆయన హామీ మేరకు రాష్ట్ర ప్రజలు తమకు అధికారం ఇచ్చార న్నారు. దేశానికి మార్గదర్శకంగా నిలిచామని, దేశంలోని అనేక పార్టీలు కులగణన కోరుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కులగణన చేయాలని ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ధర్నా సైతం నిర్వహించామని, కులగణనపై నిర్ణయం తీసుకున్న కేంద్రానికి ధన్యవాదాలు చెబుతున్నామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు

.
రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా కులగణన చేపట్టాం
కులగణన విషయంలో కేంద్రమంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలని, కమిటీలో కేంద్ర మంత్రులు, సీనియర్ అధికారులను నియమించాలని సూచించారు. తెలంగాణలో కులగణన చేపట్టినప్పుడు 8 పేజీల్లో 57 ప్రశ్నల ద్వారా వివరాలు సేకరించామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్యుమరేటర్ నుంచి సిఎస్ వరకు పలుసార్లు ఈ విషయమై సమీక్ష చేశామని ఆయన వివరించారు. కులగణన విషయంలో అనేక సూచనలు, సలహాలు వచ్చాయన్నారు. ప్రభుత్వం తరపున టోల్‌ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చామని, ఆన్‌లైన్‌లో నమోదుకు అవకాశం ఇచ్చినట్లు గుర్తు చేశారు.

రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా కులగణన చేపట్టామని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. తాము కులగణన చేపట్టినప్పుడు ప్రజాసంఘాల ప్రతినిధులను సంప్రదించి ప్రశ్నపత్రం తయారు చేశామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని బలహీనవర్గాల తరఫున రాహుల్‌కు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. కులగణనకు ఉత్తమ్, భట్టి, సీతక్క, పొన్నం, శ్రీధర్‌బాబులతో కమిటీ వేశామని ఆయన తెలిపారు. తెలంగాణలో కులగణన చేస్తామని మాటిచ్చి ఆ ప్రక్రియను కూడా పూర్తి చేశామని, అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి కూడా పంపామని సిఎం రేవంత్ తెలిపారు. మూడు నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే పూర్తి చేశామని పేర్కొన్నారు. బిసిలకు 50 శాతం కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలని సిఎం రేవంత్ కోరారు.

కేంద్రంపై విమర్శలు చేయడం నాకు ఇష్టం లేదు
ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కులగణనలో అన్ని పార్టీలనూ భాగస్వామ్యం చేశామన్నారు. కులగణన విషయంలో తమ అనుభవాన్ని కేంద్రంతో పంచుకుంటామని ఆయన తెలిపారు. నివేదిక తయారు చేశాక పేదలకు లబ్ధి జరగాలని ఆయన సూచించారు. ఆలస్యమైనా కేంద్రం మంచి నిర్ణయం తీసుకుందని, దానిని స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరగాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. కులగణన విషయంలో కేంద్రంపై విమర్శలు చేయడం తనకు ఇష్టం లేదన్నారు.

కేంద్రం ఎప్పుడు ప్రారంభిస్తుందో, ఎప్పుడు పూర్తి చేస్తుందో చెప్పాలి
కేంద్రం కులగణను ఎప్పుడు ప్రారంభిస్తుందో, ఎప్పుడు పూర్తి చేస్తుందో చెప్పాలని సిఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కులగణన చేసే ముందు వచ్చే సవాళ్లపై అన్ని రాష్ట్రాలతో మాట్లాడాలని సిఎం రేవంత్ సూచించారు. పార్టీలు, ప్రజాసంఘాలతో నిపుణుల కమిటీ విస్తృతంగా చర్చించాలని ఆయన పేర్కొ న్నారు. కులగణనపై విధి, విధానాలను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని ఆయన తెలిపారు.

హింసకు తాము పూర్తిగా వ్యతిరేకం
మావోయిస్టులతో శాంతి చర్చలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పందిస్తూ హింసకు తాము పూర్తిగా వ్యతిరేకమని ర్కొన్నారు. లోకంలో ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే అంతిమ పరిష్కారమని ఆయన తెలిపారు. మావోయిస్టులతో చర్చలు జరపాలన్నదే తమ ఆలోచన అని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే పార్టీ అధిష్టానంతో చర్చించాక తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

కులం విషయంలో ఎవరూ అబద్ధాలు చెప్పరు….
తాము దేశ వ్యాప్తంగా ఉన్న బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. కేంద్ర చేపట్టే కులగణను తమకంటే ఉత్తమంగా నిర్వహిస్తే సంతోషకరమని ఆయన తెలిపారు. ఆస్తుల విషయంలో జనం అబద్ధాలు చెప్పవచ్చేమో కానీ, కులం విషయంలో ఎవరూ ఆపని చేయలేరని ఆయన అన్నారు. ఏ డేటా అందుబాటులో లేని పక్షంలో కేంద్ర లెక్కలే పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. వందేళ్ల భారతదేశ చరిత్రలో ఎవరూ చేయని కులగణన తెలంగాణ ప్రభుత్వం చేసి చూపించిందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.

తక్కువ సీట్లు వచ్చినందునే రిజర్వేషన్‌లు రద్దు కాలేదు
పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి 240 సీట్లకే పరిమతమైనందున రిజర్వేషన్లు రద్దు కాలేదని, రాజ్యాంగ స్వరూపాన్ని మార్చేసే వాళ్లని ఆయన అన్నారు. ప్రజలను అప్రమత్తం చేయడం వల్లే మోడీకి 400 సీట్లు రాకుండా అపగలిగామని రేవంత్ తెలిపారు. ఒకవేళ ఆ పార్టీకే మెజారిటీ వచ్చి ఉంటే రిజర్వేషన్లను నిర్ధాక్షిణ్యంగా ఎత్తేసే వారని ఆయన ఆరోపించారు. ఎన్నికల ముందు బిజెపి కుట్రలను తిప్పి కొట్టామని, అందుకే మోడీ ఆయన నిర్ణయాలు మార్చుకున్నారని సిఎం రేవంత్ అన్నారు. బలహీన వర్గాల కోసం ఒక మెట్టు దిగడానికి కూడా తాను సిద్ధమేనని.. ఈ విషయంలో రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్ర ప్రజలకు ఎంతగానో ఉపయోగపడిందని సిఎం రేవంత్ తెలిపారు. కులగణనపై నివేదిక తయారయ్యాక బలహీన వర్గాలు, నిరుపేదలకు లబ్ధి జరగాలని అన్ని రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరగాలని ఆయన ఆకాంక్షించారు.

జనాభా లెక్కలు 2021 నుంచి వాయిదా
కులగణన విషయంలో కేంద్రంపై విమర్శలు చేయడం తనకు ఇష్టం లేదని జనాభా లెక్కలను 2021 నుంచి వాయిదా వేస్తూ వస్తున్నారని ఆయన అన్నారు. ఏడాదిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సిఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. కులగణన ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని బిజెపి ప్రయత్నిస్తోందని, మోడీ తనను అనుకరిస్తున్నారని స్థానిక బిజెపి నాయకులు తమపై అక్కసు వెళ్లగక్కుతున్నారని సిఎం రేవంత్ మండిపడ్డారు. బిజెపి నాయకులు 11 సంవత్సరాలు అధికారంలో ఉండి కులగణనపై నిర్ణయం ఎందుకు తీసుకోలేదని సిఎం రేవంత్ ప్రశ్నించారు.

నేడు ఢిల్లీకి సిఎం రేవంత్‌రెడ్డి
సిఎం రేవంత్ రెడ్డి శుక్రవారం (నేడు) ఢిల్లీకి వెళ్లనున్నారు. నేడు సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్లూసీ) సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు సిఎం రేవంత్ రెడ్డి నేడు ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసిసి నాయకులతో పాటు, అన్ని రాష్ట్రాల ముఖ్య కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణనపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్టుగా సమాచారం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News