ఆరుగురు భక్తుల దుర్మరణం
తెల్లవారుజామున దుర్ఘటన ..70 మందికి గాయాలు
రాష్ట్రపతి ముర్మూ సంతాపం ..సిఎం సావంత్ పరామర్శ
పనాజీ : ఉత్తర గోవాలో శనివారం ఒక ఆలయ ఉత్సవంలో విషాద ఘటన జరిగింది. భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు. పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ విషయాన్ని అధికారులు ప్రకటించారు. షిర్గావో గ్రామంలో ప్రఖ్యాత , పురాతన శ్రీ లైరాయి దేవీ ఆలయం నెలకొని ఉంది. ఆలయ వార్షిక ఉత్సవం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎంతో ఆనందంగా ఉత్సవానికి వచ్చిన స్థానిక ప్రజలకు ఇక్కడి ఘటన పిడుగుపాటుగా మారింది. ఘటన జరిగిన ప్రాంతంలో హృదయవిదారక దృశ్యాలు చోటుచేసుకున్నాయి. పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. గోవా నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక ఇతర ప్రాంతాల నుంచి జనం ఇక్కడి ఉత్సవానికి వచ్చారు.
ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఈ దశలోనే అనుకోకుండా తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు. దర్యాప్తు చేపట్టామని, ఇది పూర్తి అయితేనే ఘటనకు కారణాలు తెలిసి వస్తాయని వివరించారు. ఇక్కడ జరిగిన దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడ్డ వారు త్వరితగతిన కోలుకోవాలని ఆశించారు. విషాద ఘటన జరిగిన ప్రాంతం పనాజీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెల్లవారుజామున తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు.
పొరుగు రాష్ట్రాల నుంచే జనం వేలాదిగా ఇక్కడికి పలు రకాల రవాణా సాధనాల ద్వారా వచ్చారు,. దాదాపుగా 70 మంది వరకూ గాయాల పాలయ్యారని, వీరికి ఆసుపత్రులలో సరైన చికిత్స జరుగుతోందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే మీడియాకు తెలిపారు. ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆసుపత్రులకు వెళ్లి పరామర్శించారు. వారి సాధకబాధకాలు తెలుసుకున్నారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.