మన తెలంగాణ / హైదరాబాద్ : పార్లమెంట్‌లో బిసి బిల్లు ప్రవేశ పెట్టి బిసిలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యులు, జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విజయవాడ లో ప్రధాని నరేంద్ర మోడీని కలిసి బిసిల డిమాండ్లపై వినతిపత్రం సమర్పించినట్లు కృష్ణయ్య తెలిపారు. కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయింయడం పట్ల ప్రధానికి కృతజ్నతలు తెలిపినట్లు ఆయన వెల్లడించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన కోరారు. మనదేశంలో 56 శాతం జనాభా కలిగిన బిసిలకు ఇంతవరకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా ఈ కులాలను అణచివేశారని విమర్శించారు.
ప్రపంచంలో అణచివేతకు వివక్షకు గురైన అన్ని వర్గాలకు, అన్ని రంగాలలో వాటా ఇచ్చి ఇతర అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా అభివృద్ధి చేశారని, కాని దేశంలో పీడిత కులాలను ఇంకా అణచి వేయడానికి చూస్తున్నారు తప్ప అభివృద్ధి చేయడానికి గత ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదన్నారు. బిసి ఉద్యోగులకు ప్రమోషన్లను రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు బిసిల జనాభా ప్రకారం 27 శాతం నుండి 56 శాతానికి పెందాలని, బిసిల విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్ల పై ఉన్న క్రిమిలేయర్‌ను తొలగించాలన్నారు.
బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బిసిల అభివృద్ధికి ప్రత్యేక పథకాలను రూపొందించాలని, ఎస్‌సి, ఎస్‌టి అబ్రా సిటీ యాక్ట్ మాదిరిగా బిసిలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి చట్టం తేవాలని, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్‌లు కల్పించాలని సుప్రీం కోర్టు- హై కోర్టు జడ్జిల నియామకాలలో రిజర్వేషన్లు అమలు చేయాలని, కేంద్ర బడ్జెట్‌లో రెండు లక్షల కోట్లు బిసిలకు కటాయించి కేంద్రంలో బిసిలకు పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్ షిప్, ఫీజు రియింబర్స్మెంట్ సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలని, రాష్ట్రాలు అమలు చేసి పధకాలకు 60 శాతం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని, జాతీయ బిసి కార్పొరేషన్ ద్వారా బిసి కుల వృత్తులకు సబ్సిడి రుణాలు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.