బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. 11 మ్యాచ్‌లు ఆడిన ఆర్‌సిబి 8 మ్యాచుల్లో విజయం సాధించి దాదాపు ప్లే ఆఫ్స్‌కి చేరుకుంది. ఈ సీజన్‌లో జట్టులోని ప్రతీ ఆటగాడు దూకుడుగా ఆడుతున్నారు. ముఖ్యంగా రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ 505 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ముందున్నాడు. అయితే కోహ్లీ స్ట్రైక్‌రేట్‌పై మాత్రం విమర్శలు వస్తున్నాయి. అతని ఆట టీ-20లకు పనికి రాదు అంటూ కొందరు విమర్శిస్తున్నారు.
దీనిపై టీం ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించారు. కోహ్లీ ఇప్పటివరకూ ప్రతీ మ్యాచ్‌లో యాంకర్ పాత్ర పోషించాడని ఇర్ఫాన్ అన్నారు. ‘‘అంతకు ముందు 100 స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టాడు.. కానీ, అతను దూకుడుగా ఆడాలంటే ఆడగలడు. సిఎస్‌కేపై 187 స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో అతనే నిజమైన ఛాంపియన్. దూకుడుగా ఎప్పుడు ఆడాలో, నిలకడగా ఎప్పుడు పరుగులు చేయాలో కోహ్లీకి బాగా తెలుసు’’ అంటూ ఇర్ఫాన్ పేర్కొన్నారు.