ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ పర్యాటకానికి విశేష ప్రచారం
విదేశీ పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించనున్న తెలంగాణ పర్యాటకం
పెట్టుబడులకు ఊతమివ్వనున్న ‘మిస్‌వరల్డ్’
బహుముఖ ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా జరిగే భారీ ఈవెంట్ ‘మిస్ వరల్డ్’ పోటీలకు తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వడం వెనుక బహుముఖ ప్రణాళికను రూపొందించింది. తెలంగాణలో ఉన్న అద్భుత చారిత్రక, సాంస్కృతిక, పర్యాటకం గురించి ప్రపంచ దేశాలకు తెలియజెప్పడమే కాకుండా విదేశీ పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించే లక్షంతో మిస్ వరల్డ్ వేడుకకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన తెలంగాణను దేశంలో ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా రూపుదిద్దడం, పర్యాటక రంగంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే తెలంగాణ తొలి టూరిజం పాలసీనీ రూపొందించింది.
ఈ నూతన పర్యాటక పాలసీని విశ్వవ్యాప్తం చేసేందుకు మిస్ వరల్డ్ పోటీలను సరైన వేదికగా తెలంగాణ సర్కార్ ఉపయోగించుకుంటుంది. తద్వారా భవిష్యత్తులో విదేశీ పర్యాటకుల సంఖ్యను మరింత పెంచుకోవడమే కాకుండా రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆర్జించేందుకు ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇక ఉపాధి అవకాశాలు పర్యాటక రంగం అభివృద్ధి చెందే కొద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉండడంతో ఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు అందివచ్చిన అవకాశంగా ‘మిస్ వరల్డ్’ పోటీలు వేదిక అవుతున్నాయి. ఇలా బహుముఖ కార్యాచరణతో చేపట్టే అందగత్తెల పోటీలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
విదేశీ పర్యాటకుల సందర్శన రెట్టింపయ్యే అవకాశం
మిస్ వరల్డ్ పోటీల కారణంగా తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించే విదేశీ పర్యాటకుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ భారీ వేడుకలో పాల్గొనేందుకు 120 దేశాల ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. దీనికితోడు 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం అయ్యే మిస్ వరల్ ఈవెంట్లో తెలంగాణకు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం కల్పించి తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రముఖంగా ప్రమోట్ చేసేందుకు తద్వారా ప్రపంచ పర్యాటకంలో తెలంగాణను ప్రముఖంగా నిలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. 2024లో తెలంగాణను 1,55,113 మంది విదేశీ పర్యాటకులు సందర్శించారు. వీరి సంఖ్య ఈ ఏడాది రెట్టింపయ్యేందుకు మిస్ వరల్డ్ ఈవెంట్‌ను ఉపయోగించుకుంటోంది. పలు దేశాలకు చెందిన అందగత్తెలు ఒక్కొక్కరుగా హైదరాబాద్ నగరానికి చేరుకుంటున్నారు. వారందరికి స్థానిక సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న నిర్వాహకులు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆహ్వానించి తీసుకువస్తున్నారు.
ఆకర్షణీయంగా చారిత్రక ప్రదేశాలు
‘మిస్ వరల్డ్’ పోటీలలో భాగంగా హైదరాబాద్, వరంగల్ వేయి స్తంభాల ఆలయం, ఖిలా వరంగల్, భద్రకాళి , రామప్ప, నాగార్జున సాగర్, పోచంపల్లి, పిల్లలమఱ్ఱి వృక్షం వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలను ‘మిస్ వరల్డ్’ కంటెస్టెంట్లు సందర్శించేందుకు అవసరమైన షెడ్యూల్‌ను నిర్వాహకులు ఖరారు చేశారు. అన్నింటికీ మించి హైదరాబాద్‌కి తలమానికంగా ఉన్న చార్మినార్‌ను ఈ నెల 12న సందర్శించనున్నారు. హైదరాబాద్ సాంస్కృతిక వారసత్వ గొప్పదనం ప్రపంచానికి తెలియజేసేలా చార్మినార్, లాడ్ బజార్లలో మిస్ వరల్ కంటెస్టెంట్ లు ‘హెరిటేజ్ వాక్ ‘ నిర్వహిస్తారు. ఇందుకు అనుగుణంగా అక్కడ శోభాయమానంగా ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతున్నారు. చారిత్రక వారసత్వానికి ప్రతిరూపంగా ఉన్న చౌమల్ల ప్యాలెస్‌ను సందర్శించి ఓల్డ్ సిటీ (పాతబస్తీ) ఘనమైన చరిత్ర, వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేస్తారు.
చారిత్రక, ఆధ్యాత్మిక నగరం వరంగల్‌లోని వెయ్యి స్థంభాల గుడి, వరంగల్ పోర్ట్‌ను సందర్శిస్తారు. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయంను సందర్శనతో పాటు కాకతీయులు యుద్ధ రంగానికి వెళ్లే ముందు ప్రదర్శించే పేరిణి నృత్యంను రామప్పలో తిలకిస్తారు. ఆధ్యాత్మిక టూరిజంలో భాగంగా యాదగిరిగుట్ట ఆలయాన్ని సంర్శనతో పాటు హ్యాండ్లూమ్ ఎక్స్‌పీరియన్సల్ టూర్లో భాగంగా పోచంపల్లిలో చేనేత వస్త్రాల తయారీని, ప్రదర్శనను ప్రత్యక్షంగా తిలకిస్తారు. మహబూబ్ నగర్‌లోని పిల్లలమర్రి వృక్షాన్ని, హైదరాబాదు నగరానికే ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ఎక్స్పీరియం పార్కును సందర్శిస్తారు. దాదాపు 20 రోజుల పాటు జరిగే భారీ వేడుకలో ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమంలో కంటెస్టెంట్లు పాల్గొనేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.
తెలంగాణ ‘మల్టీ డైమెన్షనల్ టూరిజం హబ్‘
ఇలా రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ప్రదేశాలను ప్రపంచ సుందరీమణులు సందర్శించడం వల్ల రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక, చారిత్రక, సాంస్కృతికి వారసత్వ ప్రదేశాల గురించి ప్రపంచ వ్యాప్తం కావడంతో తెలంగాణను ప్రపంచ పటంలో ఒక ‘మల్టీడైమెన్షనల్ టూరిజం హబ్‘గా నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశంతో అధికారులు కొన్ని రోజులుగా శ్రమిస్తున్నారు. ఆయా ప్రదేశాలను విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ పర్యాటక ప్రదేశాలకు విశేష ప్రచారం దక్కనుంది. తెలంగాణ సాంస్కృతిక వైభవం, చారిత్రక గాథలు, ఆధునిక అభివృద్ధి, పర్యాటక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.