శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని మరువక ముందే మరో దాడి చేసేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సందేశం అందింది. ఈసారి ముష్కరులు జైళ్లను లక్ష్యంగా చేసుకోనున్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. జైళ్లలో ఉన్న కీలక ఉగ్రవాద నాయకులను విడిపించేందుకు ఈ కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో శ్రీనగర్, కోట్ బాల్వాల్, జమ్ములో జైళ్ల వద్ద అధికారులు భద్రత కట్టుదిట్టం చేశారు. అంతేకాక.. సురాన్‌కోట్ వద్ద ఉన్న ఉగ్రస్థావరంలో నిల్వ చేసిన ఐఇడిలను భద్రతా బలగాలు గుర్తించాయి.
కాగా, ఏప్రిల్ 22న పవహ్‌గామ్‌లో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. ఆర్మీ సిబ్బంది వేషధారణలో వచ్చిన ముష్కరులు ఫర్యాటకులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం పాక్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇంతలోనే మరో ఉగ్రదాడికి సంకేతాలు రావడం భద్రతా బలగాలను కంగారు పెడుతోంది.