కొన్ని సెకన్ల పాటు భూప్రకంపనలు
రిక్టర్ స్కేలుపై 3.8 గా నమోదు
భయాందోళనలతో పరుగులు తీసిన ప్రజలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భూమి కంపించింది. పలు ప్రాంతాలలో కొన్ని సెనక్ల పాటు భూప్రకంపనలు సంభవించాయి. కొమురంభీం ఆసిబాద్ జిల్లా గోలేటి సమీపంలో పులికుంట కేంద్రంగా సోమవారం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.8 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజి అధికారులు పేర్కొన్నారు. మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, కరీంనగర్ జిల్లా వేములవాడ, గంగాధర, చొప్పదండి, రామడుగు, నిజాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి, మోర్తాడ్, సిరికొండ మండలాల్లో భూమి 2 సెకన్ల పాటు కంపించింది. మరోవైపు నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం, లక్ష్మణచందా, జన్నారం మండలాల్లో 2 నుంచి 5 సెకన్ల పాటు భూ ప్రకంపనలు సంభవించాయి.
అనూహ్య పరిణామాలతో హడలెత్తిన ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో భూ ప్రకంపనలతో పల్లె అర్జున్ అనే రైతు ఇల్లు కూలిపోగా, ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఆయన కుటుంబ సభ్యులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. దాంతో వారు పెను ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. కాగా, ఇటీవల రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భూమి కంపించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే మరోసారి భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హచ్చరికలు జారీ చేశారు. తమ పరిశోధనల ఆధారంగా తెలంగాణలో రామగుండంతో పాటు పలు సమీప ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించే ప్రమాదం ఉందని, ఆ ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండలం గోలేటి గ్రామ పరిసర ప్రాంతాలను జాతీయ భూకంప కేంద్రంగా ఎన్‌సిఎస్ నిర్ధారించింది.