జీతాలు ఇస్తున్న ప్రజలపైనా మీ సమరం? సహకరించాల్సిన ఉద్యోగులే
సమరమంటే ఎలా? ఇప్పుడు కావాల్సింది సమయ స్ఫూర్తి ఏమైనా
సమస్యలు ఉంటే రండి..చర్చిద్దాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది
ఉద్యోగ సంఘాలు నన్ను కోసుకొని తిన్నా… నా దగ్గర పైసా లేదు అప్పు
కోసం పోతే దొంగను చూసినట్లు చూస్తున్నారు ఢిల్లీకి పోతే చెప్పులు
ఎత్తుకుపోతాడేమోనని అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడంలేదు ఎవరూ
బజారులో నమ్మడం లేదు అప్పులు పుట్టడం లేదు మళ్లీ కోతుల
గుంపునకు రాష్ట్రాన్ని అప్పగించకండి ఉద్యోగ సంఘాల సమర నినాదంపై
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వం సమరమే అంటూ ఉద్యోగ సంఘాలు ప్రకటించడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుకా సమరం చేస్తారు..? అని ప్రశ్నించారు. తనను కోసినా సరే.. వచ్చిన ఆదాయానికి మించి ఖర్చు చేయలేనని సిఎం స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం సమరం అంటున్నారని, సమరం ఎవరిమీద..? అని అడిగారు. ప్రభుత్వం అంటే తాము ఒక్కరమే కాదు అని,ఉద్యోగులంతా తమ కుటుంబ సభ్యులే అని పేర్కొన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇస్తున్న ప్రజలే తమకు ఉద్యోగాలిస్తున్నారని, ఉద్యోగులు ప్రకటించిన సమరం 97 శాతం ప్రజల మీదనా..? అని నిలదీశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సహకరించాల్సిన ఉద్యోగ సంఘాలే సమరం అంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే చర్చకు రండి.. చర్చిద్దామని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన బాధ్యత ప్రభుత్వ సంఘాలకు లేదా..? అని ప్రశ్నించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సోమవారం ‘తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్ జీ అవార్డ్ -2025’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, సిఎస్ రామకృష్ణారావు, డిజిపి జితేందర్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, తమ సమస్యల పరిష్కారం కోసం పోరు బాట పడతామని ప్రభుత్వ ఉగ్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జెఎసి చేసిన ప్రకటనపై ఘాటుగా స్పందించారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు సమరం అని ప్రకటించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ నాయకుల చేతుల్లో పావులుగా మారొద్దు
ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తున్నాయని, వారి కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దు అని పేర్కొన్నారు. కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలు బాధ్యత మరిస్తే సమాజం సహించదు అని పేర్కొన్నారు. అప్పులు పుట్టినా ఏదైనా చేయొచ్చు అని, కానీ ఎక్కడా అప్పు పుట్టట్లేదని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది అని, స్వీయ నియంత్రణే పరిష్కారం అని తెలిపారు. ప్రభుత్వం మన కుటుంబం అని, కుటుంబం పరువును బజారున పడేయొద్దు అని ఉద్యోగ సంఘాలకు సిఎం విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు కావాల్సింది సమరం కాదు.. సమయస్ఫూర్తి, సంయమనం అని వ్యాఖ్యానించారు. తెలంగాణను మళ్లీ కోతుల గుంపునకు అప్పగించొద్దు అని, తనతో కలిసి రండి.. తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్దామని రేవంత్‌రెడ్డి అన్నారు.
మనం పాలకులం కాదు..సేవకులం
కొన్ని రాజకీయ పార్టీలు మాపై ఆరోపణలు చేస్తున్నాయి.. అవన్నీ వాళ్లు చెల్లించకుండా పెండింగ్ పెట్టి వెళ్లిన బకాయిలే సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గత పాలకులు ఉచిత విద్యుత్ పేరుతో విద్యుత్ బకాయిలు పెట్టి వెళ్లారని ఆరోపించారు. ఉచిత విద్యుత్ అని చెప్పి విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టి వెళ్లారని అన్నారు. విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొనుగోలు చేసి సింగరేణికి బకాయి పెట్టి వెళ్లారని మండిపడ్డారు. ప్రాజెక్టులు కట్టామని చెప్పి .. కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టారని, 11 శాతం వడ్డీకి అప్పులు తెచ్చారని, ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం అంటే తాము ఒక్కరమే కాదు అని, మనమంతా కలిస్తేనే ప్రభుత్వం అని పేర్కొన్నారు. మనం పాలకులం కాదు.. సేవకులం అని ఉద్యోగులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ప్రతీ నెలా ఏడు వేల కోట్లు కట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వానిది అని, గత పాలకులు 8500 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు పెట్టి వెళ్లారని చెప్పారు. కేవలం పదహారు నెలల్లో తాము 30 వేల కోట్ల నగదు రైతుల ఖాతాలకు బదిలీ చేశామని తెలిపారు.
నన్ను కోసినా రాష్ట్రాదాయం నెలకు రూ. 18,500 కోట్లే వస్తుంది
రాష్ట్రం ఆర్థికంగా ఏమాత్రం బాగాలేదని, తెలంగాణకు అప్పు పుట్టడం లేదని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి అప్పు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు కోసం ప్రభుత్వ అధికారులు బ్యాంకర్లను కలవడానికి వెళితే దొంగలను చూసినట్లు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మనవాళ్లు ఎవరైనా ఢిల్లీకి వెళితే కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని, తెలంగాణ ప్రతినిధులను చెప్పులు కూడా ఎత్తుకు వెళతారేమో అన్నట్లుగా చూస్తున్నారని పేర్కొన్నారు. తనను కోసినా నెలకు తెలంగాణ ఆదాయం రూ. 18,500 కోట్లే వస్తుందని పేర్కొన్నారు. ఖర్చులకు మాత్రం రూ. 22,500 కోట్లు అవసరమని చెప్పారు.
ఉద్యోగ సంఘాల నాయకులు తనను కోసుకుని తిన్నా తన దగ్గర పైసలు లేవు అని చెప్పారు. ఇప్పుడు ఏ పథకం ఆపాలో ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పాలని ప్రశ్నించారు. విద్యుత్ సబ్సిడీని తీసేద్దామా లేక ఇంకేం చేద్దామని నిలదీశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధర్నాలు, దీక్షలు చేస్తే ఉన్న ప్రభుత్వ వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థికంగా మరింత దివాళా రాష్ట్రంగా మారిపోతామని అన్నారు. అప్పు పుడితే తాను కూడా ఏదో ఒకటి తెచ్చి ఇచ్చేవాడిని అని, కానీ అప్పు పుట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాల్లో ఏదీ ఆపమంటారో ఉద్యోగ సంఘాల నాయకులే చెప్పాలని అన్నారు.
ప్రస్తుత సమస్యకు స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారం అని, ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే మనల్ని బజారులో ఎవరైనా నమ్ముతారని చెప్పారు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజారులో పడినట్లు మన పరిస్థితి అలాగే ఉంటుందని తెలిపారు. ఉద్యోగ సంఘ నాయకులు దీనిని ఆలోచించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబం అని, పరువును బజారున పడేస్తామంటే కుటుంబ పెద్దగా వద్దు అని తాను విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. రూ. 100 పెట్రోల్ రూ.200 చేయమంటారా..? రూ. 30 బియ్యం రూ. 60 చేద్దామా..? బోనస్లు, జీతాల పెంపు ఎలా చేయాలో ఉద్యోగ సంఘాలే చెప్పాలని అన్నారు. 11 శాతం మిత్తికి అప్పు తెచ్చిన కెసిఆర్ రాష్ట్రాన్ని దివాళా తీయించి తీసి ఫామ్‌హౌస్‌లో పడుకున్నాడని విమర్శించారు. సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధరలు పెంచితేనే పథకాలు అమలు చేయడానికి వీలవుతుందని అన్నారు. ధరలు పెంచకుండా, ఇప్పుడు ఉన్న పథకాలు ఆపకుండా కొత్త కోరికలు నెరవేర్చడం కుదరదని ఉద్యోగ సంఘాల నాయకుల డిమాండును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
శాంతిభద్రతలు అదుపులో ఉండటం వల్లనే భారీ పెట్టుబడులు
ఏ రాష్ట్రమైన, దేశమైనా అభివృద్ధి చెందాలంటే శాంతిభద్రతలు ముఖ్యమని సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో సైనికుల్లా తెలంగాణ పోలీసులు రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షిస్తున్నారని అన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి కాబట్టే.. తెలంగాణ రాష్ట్రం ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షించగలుగుతోందని చెప్పారు. విధినిర్వహణలో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు భరోసా ఇస్తున్నామని తెలిపారు. విధినిర్వహణలో మరణించిన ఐపీఎస్‌ల కుటుంబాలకు రూ.2 కోట్లు, అదనపు ఎస్‌పి, ఎస్‌పి కుటుంబాలకు రూ. కోటిన్నర ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. నేరం జరగకుండా నియంత్రించే బాధ్యత పోలీసులపై ఉందని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలో రూ. 2.28 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు సాధించగలిగామంటే అందుకు రాష్ట్రంలో నూటికి నూరు శాతం శాంతిభద్రతలు అమలు చేయడం వల్లే సాధ్యమైందన్నారు.
అనుమానాలు, అవమానాలను దిగమింగుకుని విధినిర్వహణలో పోలీసులు నూటికి నూరు శాతం కష్టపడుతున్నారని పేర్కొన్నారు. డ్రగ్స్ నియంత్రణకు యాంటీ నార్కోటిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. మారుతున్న కాలంతో పాటు నేరగాళ్లు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారని తెలిపారు. సైబర్ క్రైమ్ నియంత్రణకు ఆ విభాగాన్ని మరింత బలోపేతం చేశామని చెప్పారు. నేరం జరిగినప్పుడే కాదు.. నేరం జరగకుండా నియంత్రించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పేర్కొన్నారు. 24 గంటల్లో 18 గంటలు పని చేసే పోలీస్ శాఖకు రావాల్సిన గుర్తింపు, గౌరవం దక్కడం లేదని చెప్పారు. పోలీసుల పిల్లలు కార్పొరేట్ స్థాయి విద్యను అందుకోవాలని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించామని సిఎం తెలిపారు.