Monday, May 12, 2025

ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ వేగంగా ఎదుగుతోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) విడుదల చేసిన తాజా ’ప్రపంచ ఆర్థిక నివేదిక – ఏప్రిల్ 2025’ ప్రకారం, భారత్ ఈ ఏడాది (2025) జపాన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. ఈ కీలక పరిణామం భారత ఆర్థిక ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలవనుంది. ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరానికి భారత నామమాత్ర జడిపి 4,187.017 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 348 లక్షల కోట్లు) చేరుతుందని అంచనా.

ఇదే కాలంలో జపాన్ జిడిపి 4,186.431 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ. 347.9 లక్షల కోట్లు) ఉండొచ్చని వెల్లడించిది. ఈ స్వల్ప తేడాతో భారత్, జపాన్‌ను అధిగమించి నాలుగో స్థానానికి ఎగబాకనుంది. ప్రస్తుతం (2024 వరకు) భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న సంగతి విదితమే. భారత్ ప్రస్థానం ఇక్కడితో ఆగదని, రానున్న సంవత్సరాల్లో జర్మనీని కూడా అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. 2028 నాటికి భారత జిడిపి 5,584.476 బిలియన్ డాలర్లకు చేరుతుందని, అదే సమయంలో జర్మనీ జిడిపి 5,251.928 బిలియన్ డాలర్లుగా ఉంటుందని లెక్కగట్టింది. అంతకు ముందే, అంటే 2027 నాటికి, భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల (సుమారు 5,069.47 బిలియన్ డాలర్లు) మార్కును దాటుతుందని నివేదిక స్పష్టం చేసింది.

అగ్రస్థానాల్లో అమెరికా, చైనా..

ఇక ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక వ్యవస్థల విషయానికొస్తే, 2025లో కూడా అమెరికా (30.5 ట్రిలియన్ డాలర్లు), చైనాలే (19.2 ట్రిలియన్ డాలర్లు) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతాయని ఐఎంఎఫ్ వెల్లడించివది. ఈ దశాబ్దం చివరి వరకు ఈ స్థానాల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంచనా.

ఐఎంఎఫ్ ప్రపంచ ఆర్థిక నివేదిక, ఏప్రిల్ 2025

2025 ప్రపంచ టాప్ 10 ఆర్థిక వ్యవస్థలు : అమెరికా (30507.217 ), | చైనా (19231.705), | జర్మనీ (4744.804)m భారత్ (4187.017), | జపాన్ (4186.431), | యునైటెడ్ కింగ్‌డమ్ (3839.18), | ఫ్రాన్స్ (3211.292), |ఇటలీ (2422.855), | కెనడా (2225.341), బ్రెజిల్ | (2125.958). ఇదిలా ఉండగా, ఐఎంఎఫ్ తన తాజా నివేదికలో 2025 సంవత్సరానికి భారత జిడిపి వృద్ధి అంచనాను 6.2 శాతానికి స్వల్పంగా తగ్గించింది. జనవరిలో విడుదల చేసిన నివేదికలో ఈ అంచనా 6.5 శాతంగా ఉంది.

పెరిగిన వాణిజ్య ఉద్రిక్తతలు, ప్రపంచ అనిశ్చితి కారణంగానే ఈ సవరణ చేసినట్లు ఐఎంఎఫ్ వెల్లడించింది. ముఖ్యంగా అమెరికా సుంకాల నిర్ణయాల వంటి అంశాలు ఈ అనిశ్చితికి కారణమవుతున్నాయని తెలిపింది. అయినప్పటికీ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేట్ వినియోగం బలంగా ఉండటం భారత వృద్ధికి ఊతమిస్తుందని నివేదిక వెల్లడించింది. మరోవైపు, గత 80 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ప్రపంచం ఓ కొత్త శకంలోకి అడుగుపెడుతోందని ఐఎంఎఫ్ తన నివేదికలో హెచ్చరించడం గమనార్హం. ఈ మారుతున్న క్రమంలో భారత్ కీలక ఆర్థిక శక్తిగా ఎదగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News