శాన్ ఫ్రాన్సిస్కో: అమెరికాలోని శాన్ డియాగో తీరంలో పడవ ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున టోరీ పైన్స్ స్టేట్ బీచ్ సమీపంలో పడవ బోల్తా పడటంతో ముగ్గురు మరణించగా, ఓ భారతీయ కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు సహా ఏడుగురు గల్లంతయ్యారు. ఈ ఘటనపై శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ విచారం వ్యక్తం చేసింది.
భారత కాన్సులేట్ జనరల్ ప్రకారం.. బాధితుల్లో ఒక భారతీయ కుటుంబం కూడా ఉంది. ఇద్దరు భారతీయ పిల్లలు ఇప్పటికీ కనిపించకుండా పోయారు. వారి తల్లిదండ్రులు లా జోల్లాలోని స్క్రిప్స్ మెమోరియల్ హాస్పిటల్లో వైద్య చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని కుటుంబానికి అవసరమైన అన్ని సహాయాన్ని అందిస్తున్నామని కాన్సులేట్ Xలో వెల్లడించింది. కాగా, ఈ సంఘటనలో నలుగురు గాయపడినట్లు సమాచారం. మిస్సైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, పడవ బోల్తా పడటానికి గల కారణం ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.