ప్రముఖ నటి సమంత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. సమంత నేతృత్వంలోని వస్తున్న తొలి చిత్రం ‘శుభం’. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ క్రమంలో విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమంత మాట్లాడుతూ “నిర్మాతగా నేను ఓ కొత్త ఆలోచనతో ఈ ‘శుభం’ సినిమాను ప్రారంభించాను. కొత్త వారితో కొత్త కథల్ని చేసి అందరినీ అలరించాలనే ఉద్దేశంతో ట్రా లా లా ప్రొడక్షన్ బ్యానర్‌ను మొదలుపెట్టాను. మే 9న ఫ్యామిలీతో కలిసి మా మూవీని చూడండి. ఈ సినిమాను చూసి థియేటర్ నుంచి ఓ మంచి నవ్వు తో బయటకు వస్తారు”అని అన్నారు.
ప్రవీణ్ కండ్రేగుల మాట్లాడుతూ .. “శుభం సినిమా అద్భుతంగా ఉంటుంది. ఇంత వరకు తెలుగులో ఇలాంటి కంటెంట్ రాలేదు. ఇలాంటి కొత్త కంటెంట్ రావడం చాలా అరుదు. ఇలాం టి హారర్, కామెడీ జానర్‌లో చిత్రాలు రాలేదు. సమంత లేకపోతే మా ‘శుభం’ ఇక్కడి వరకు వచ్చి ఉండేది కాదు”అని తెలిపారు. రైటర్ వసంత్ మరింగంటి మాట్లాడుతూ .. “సమంత వల్లే ఈ ప్రాజెక్ట్ ఇక్కడి వరకు వచ్చింది. కుటుం బ సమేతంగా ఈ మూవీని చూడొచ్చు”అని తెలియజేశారు. హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ “వసంత్ కథ ఎంత అద్భుతంగా ఉంటుందో.. తెరపైకి తీసుకు రావడంలో ప్రవీణ్ మ్యాజిక్ చేశారు. శ్రియా, శ్రావణి, షాలినీ అందరూ అద్భుతంగా నటించారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చరణ్, శ్రీనివాస్ గవిరెడ్డి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మీ, షాలిని, హిమాంక్, అవినాష్ పాల్గొన్నారు.