Tuesday, May 6, 2025

ట్రంప్ దెబ్బకు ఫలితాలు తారుమారు

- Advertisement -
- Advertisement -

ట్రంప్ దురుసు వ్యాఖ్యల ప్రభావం అమెరికాపై మాత్రమే కాదు, ఇతర దేశాల మీద కూడా కనబడుతోంది. తాజాగా జరిగిన కెనడా, ఆస్ట్రేలియా ఎన్నికలను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కెనడా పార్లమెంటు ఎన్నికల్లో లిబరల్ పార్టీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే, ఇటీవలే పదవినుంచి దిగిపోయిన జస్టిన్ ట్రూడో ఆ పార్టీకి చేసిన నష్టం అంతాఇంతా కాదు. కోరి ఇండియాతో కయ్యానికి కాలు దువ్వి, సిక్కు ఉగ్రవాదులకు వత్తాసు పలుకుతూ స్వజాతీయులైన కెనడియన్లలో కావలసినంత అప్రదిష్టను మూటగట్టుకున్నారు. జనవరి తొలివారంలో ఆయన రాజీనామా చేసేనాటికి విపక్ష కన్జర్వేటివ్ పార్టీకంటే అధికార లిబరల్ పార్టీ 20 పాయింట్లు వెనకబడి ఉంది.

జనవరి మూడో వారంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాక, కెనడాలో వెంటవెంటనే మార్పు లు చోటుచేసుకున్నాయి. ఇరుగుపొరుగు దేశాలతో స్నేహభావంతో మెలగాలనే ఇంగితం లేని అగ్రరాజ్యాధినేత కెనడా, మెక్సికో వంటి దేశాలతో తెగతెంపులు చేసుకునేందుకే ప్రయత్నించారు. అది చాలదన్నట్లు కెనడియన్ల మనోభావాలు దెబ్బతినేలా వాచాలత్వం ప్రదర్శించారు. కెనడాపై అధిక సుంకాలు విధించడమే కాదు. అమెరికాలో కెనడా 51వ రాష్ట్రం అవుతుందంటూ పదేపదే ఆయన చేసిన వ్యాఖ్యలు కెనడియన్లలో జాతీయ భావాన్ని రెచ్చగొట్టాయి.తమ ఉనికినే ప్రశ్నించేలా ట్రంప్ మహాశయుడు చేస్తున్న వ్యాఖ్యలు వారిని ఒక్కతాటిపై నిలిచేలా చేశాయి. అదే సమయంలో లిబరల్ పార్టీ పగ్గాలు చేపట్టిన మార్క్ కార్నీ ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడంలో నూటికి నూరు శాతం విజయం సాధించారు.

ట్రంప్‌ను తీవ్రంగా వ్యతిరేకించడం ద్వారా, ఎన్నికల సభలలో ట్రంప్ వ్యాఖ్యలను ఎండగట్టడం ద్వారా మెజారిటీ ఓటర్ల మనసు గెలుచుకున్నారు. మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా తన అధీనంలోకి తెచ్చుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారంటూ ఆయన చేసిన ఎన్నికల ప్రసంగాలు ఓటర్లలో ఆలోచన రేకెత్తించాయి. ఇదే పని కన్జర్వేటివ్ నేతలు చేయలేకపోయారు. ఫలితంగా మెజారిటీకి కేవలం మూడు సీట్లు తక్కువగా 169 సీట్లు గెలుచుకుని లిబరల్ పార్టీ తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. మూడు నెలల ముందు కార్నీ కేవలం మాజీ సెంట్రల్ బ్యాంకర్ మాత్రమే. రాజకీయాలలో ఎలాంటి అనుభవం లేని ఆయన మూడు నెలలు తిరిగేసరికి ప్రధాని కాబోతున్నారంటే అందుకు పరోక్షంగా డొనాల్డ్ ట్రంప్ కారణమని చెప్పక తప్పదు. విచిత్రంగా కెనడా ఎన్నికల తర్వాత ఐదు రోజులకు జరిగిన ఆస్ట్రేలియా ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి పునరావృతమైంది. ట్రంప్ సుంకాల విధానమే ఆస్ట్రేలియా లోనూ అధికార లిబరల్ పార్టీకి మరొకసారి అందలం కట్టబెట్టేందుకు పరోక్షంగా కారణమైంది. కెనడాపై ట్రంప్ పది శాతం సుంకాలు విధించారు.

అమెరికా వైఖరిని అప్పట్లోనే ప్రధాని అల్బనీస్ తీవ్రంగా ఖండించారు. కాగా, ట్రంప్ బాటలో నడుస్తానని, ప్రభుత్వ వ్యయంలో కోత విధించి, ఉద్యోగాల సంఖ్య కుదిస్తానని ప్రకటించిన విపక్ష లిబరల్ నేషనల్ పార్టీ అగ్రనేత పీటర్ క్రెయిగ్ డటన్ ఎన్నికల్లో బొక్కబోర్లా పడగా, ఎవరినీ అనుసరించబోమనీ, విలువలకు అనుగుణంగానే పాలన కొనసాగిస్తానని నమ్మబలికిన ప్రస్తుత ప్రధాని అల్బనీస్ మరోసారి లిబరల్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. గత రెండు దశాబ్దాలలో ఆస్ట్రేలియాలో రెండోసారి ఎన్నికల్లో గెలిచిన తొలి ప్రధానిగా ఆయన రికార్డు సృష్టించారు. వాస్తవానికి ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందువరకూ ఆస్ట్రేలియాలో ఈసారి విపక్ష కన్జర్వేటివ్ పార్టీదే విజయమని అందరూ ఊహించారు. కానీ కెనడాలో మాదిరిగానే ఇక్కడ కూడా ఈ మూడు నెలల్లోనే పరిస్థితులు మారి, అధికార పార్టీవైపు జనం మొగ్గు చూపడం విచిత్రం.

ఇరు దేశాల్లోనూ విపక్ష నేతలు ట్రంప్ విధానాలకు వత్తాసు పలికి, పరాజయాన్ని మూటగట్టుకోగా, ట్రంప్ విధానాలను ఎండగట్టడం ద్వారా అధికార పార్టీలు లాభపడ్డాయని చెప్పవచ్చు. ఇరు దేశాల్లోనూ ట్రంప్ సుంకాల బెదిరింపుల పట్ల యువ ఓటర్లలో తీవ్ర వ్యతిరేకత కనిపించడం మరో ముఖ్యమైన విషయం. ప్రపంచ దేశాలలో అమెరికా పట్ల పెరుగుతున్న వ్యతిరేకతకు తాజాగా జరిగిన కెనడా, ఆస్ట్రేలియా ఎన్నికలే ఉదాహరణ. భవిష్యత్తులోనూ ఇలాంటి ఫలితాలే మరిన్ని దేశాలలోనూ ద్యోతకమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్ సహా ఇతర ఆసియా దేశాలను కలుపుకుని అమెరికాకు దీటుగా వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నాలను చైనా మొదలుపెట్టడం గమనార్హం. శత్రువుకు శత్రువు మనకు మిత్రుడనే నానుడి అమెరికా విషయంలో నిజమవుతోంది… అదే విచిత్రం!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News