తెలంగాణలో ఆర్టీసి సమ్మె వాయిదా పడింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆర్టీసి కార్మిక సంఘాల నేతలు సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రేపటి నుంచి రాష్ట్రంలో సమ్మె చేయనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్చలకు పిలుపునివ్వడంతో మంగళవారం తమ సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తో కార్మిక సంఘాల నేతలు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లారు. పలు సమస్యలపై చర్చించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్టాడుతూ.. సమ్మె ఆలోచన విరమించుకోవాలని కార్మిక సంఘాల నేతలకు విజ్ఞప్తి చేశారు. సమ్మెకు వెళ్లి ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని కోరారు. ఇప్పుడిప్పుడే సంస్థ కోలుకుంటుందని.. సమ్మె చేస్తే నష్టం జరుగుతుందని చెప్పారు. కార్మికుల సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. త్వరలోనే కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి చెప్పడంతో తాత్కాలికంగా సమ్మెను వాయిదా వేస్తున్నట్లు కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు.