Thursday, May 8, 2025

ఫైనల్లో భారత మహిళలు

- Advertisement -
- Advertisement -

మహిళల ముక్కోణపు వన్డే టోర్నమెంట్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. బుధవారం సౌతాఫ్రికా మహిళలతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 23 పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ విజయంతో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 337 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 314 పరుగులు మాత్రమే చేసి పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో సౌతాఫ్రికా ఫైనల్ రేసు నుంచి వైదొలిగింది. ఇక ఆతిథ్య శ్రీలంక ఇప్పటికే తుది పోరుకు అర్హత సాధించింది. ఆదివారం భారత్‌శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ సమరం జరునుంది. ఇక భారీ లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా విజయం కోసం తీవ్రంగా శ్రమించింది.

అన్నెరి డర్క్‌సెన్, కెప్టెన్ చోల్ ట్రియాన్ అద్భుత పోరాట పటిమతో భారత బౌలర్లను హడలెత్తించారు. కీలక ఇన్నింగ్స్‌తో అలరించిన అన్నెరి 80 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 81 పరుగులు చేసింది. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన ట్రియాన్ 43 బంతుల్లోనే ఐదు సిక్సర్లు, 4 ఫోర్లతో 67 పరుగులు సాధించింది. ఇతర బ్యాటర్లలో మియానె స్మిత్ (39), తజ్మిన్ బ్రిస్ట్ (26), షంగెస్ (36) పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. టీమిండియా బౌలర్లలో అమన్‌జోత్ కౌర్ మూడు, దీప్తి శర్మ రెండు వికెట్లను పడగొట్టారు.

రోడ్రిగ్స్ మెరుపు శతకం
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ ప్రతిక రావల్ (1), వన్‌డౌన్‌లో వచ్చిన హర్లిన్ డియోల్ (4) సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (28) కూడా విఫలమైంది. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన స్మృతి మంధాన ఆరు ఫోర్లతో 51 పరుగులు సాధించింది. మరోవైపు జెమీమా రోడ్రిగ్, దీప్తి శర్మ చిరస్మరణీయ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ధాటిగా ఆడిన రోడ్రిగ్స్ 101 బంతుల్లోనే 15 ఫోర్లు, ఒక సిక్స్‌తో 123 పరుగులు చేసింది. దీప్తి శర్మ 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 93 పరుగులు సాధించింది. దీంతో టీమిండియా స్కోరు 337 పరుగులకు చేరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News