రోహిత్ అనూహ్య నిర్ణయం
ఇక వన్డేలకు మాత్రమే పరిమితం!
ముంబై: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇప్పటికే అంతర్జాతీయ టి20కి రోహిత్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా టెస్టుల నుంచి కూడా తప్పుకున్నాడు. ఇక వన్డేల్లో మాత్రమే రోహిత్ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. కొంతకాలంగా రోహిత్ టెస్టులకు వీడ్కోలు పలుకుతాడని జాతీయ మీడియాలో వార్తలు వినవస్తున్నాయి. వీటిని నిజం చేస్తూ హిట్‌మ్యాన్ సంప్రదాయ టెస్టు ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. రోహిత్ 67 టెస్టుల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అతని సారథ్యంలో భారత్ ఒక సారి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరింది.
నవంబర్ 6, 2013న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు శ్రీకారం చుట్టాడు. ఇక కిందటి ఏడాడి డిసెంబర్లో మెల్బోర్న్లో ఆస్ట్రేలియాపై చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. సుదీర్ఘ రోజుల పాటు సాగిన టెస్టు క్రికెట్ కెరీర్లో రోహిత్ ఎన్నో చిరస్మరణీయ రికార్డులను సాధించాడు. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి సత్తా చాటాడు. రోహిత్ కెరీర్లో మొత్తం 67 టెస్టు మ్యాచ్‌లలో భారత్ తరఫున బరిలోకి దిగాడు. ఈ క్రమంలో 116 ఇన్నింగ్స్‌లు ఆడి 4302 పరుగులను సాధించాడు. 40.58 సగటుతో రోహిత్ ఈ పరుగులు నమోదు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ, మరో 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో రోహిత్ అత్యధిక స్కోరు 212 పరుగులు. టెస్టుల్లో రోహిత్ 473 ఫోర్లు, 88 సిక్సర్లు కొట్టాడు. భారత క్రికెట్‌కు లభించిన అత్యుత్తమ క్రికెటర్లలో రోహిత్ ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అతని సారథ్యంలో భారత్ టి20 ప్రపంచకప్ గెలుచుకుంది. వన్డే వరల్డ్‌కప్‌లోనూ ఫైనల్‌కు చేరింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కూడా జట్టును ఫైనల్‌కు చేర్చాడు.
అరుదైన గౌరవంగా భావిస్తా..
టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడాన్ని జీవింతంలోనే అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తానని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు ప్రయత్నించానని తెలిపాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఆడడం ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నాడు. ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. కాగా, టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు రోహిత్ బుధవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తన నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నాడు. ఇదిలావుంటే కొంతకాలంగా రోహిత్ సారథ్యంలో టీమిండియా టెస్టుల్లో వరుస ఓటములను చవిచూసింది. సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. అంతేగాక ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్గవాస్కర్ ట్రోఫీలోనూ ఘోర పరాజయం చవిచూసింది. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్‌ను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తారనే వార్తలు వినవించాయి. ఈ ఊహాగానాలు నిజం కాక ముందే రోహితే టెస్టుల నుంచి తప్పుకోవాలని నిర్ణయించడం విశేషం.