Thursday, May 8, 2025

మరో సామాజిక విప్లవం

- Advertisement -
- Advertisement -

చరిత్ర అన్ని వేళలా ఒకేలా ఉండదు, కాలమాన పరిస్థితులకు తగ్గట్లు మారుతూ ఉంటుంది. కారల్ మార్క్ చెప్పినట్లు చరిత్ర అంటే వర్గ పోరాటమే. 19వ శతాబ్దంలో సాంఘిక సంస్కరణ ఉద్యమం, 20 శతాబ్దంలో జాతీయ స్వాతంత్య్ర పోరాటం, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలు, ప్రస్తుతం 21వ శతాబ్దంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో సరియైన ప్రాతినిధ్యం లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ జనగణనలో కులగణనకై ఉద్యమం. ఇలా ఆయా కాలాల్లో ఆయా ఉద్యమాలు సమాజంపై ప్రభావాన్ని చూపుతూ చరిత్రగా నిలిచిపోయాయి. జనగణనలో కులగణన చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. 1931 జనాభా లెక్కల నేపథ్యంలో జనగణనలో కులగణన చేయాలనే ప్రతిపాదన 1951 జనాభా లెక్కల సందర్భంగా ముందుకొచ్చినప్పటికీ కేవలం ఎస్‌సి, ఎస్‌టిల జనాభాను మాత్రమే లెక్కించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

మొదటి బిపి కమిషన్ కాక కాళేశ్వర్ కమిషన్ సందర్భంగా, రెండవ బిసి కమిషన్ మండల కమిషన్ సందర్భంగా జనగణనలో కులగణన చర్చకు వచ్చింది. అయినా కేంద్రం ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జనగణనలో కులగణన డిమాండ్ మరోసారి ముందుకొచ్చింది. జనగణనలో కులగణనకై డిమాండ్ ఎన్నిసార్లు ముందుకొచ్చినా కేంద్రం మాత్రం జనగణనలో కులగణన వల్ల దేశ ఐక్యత దెబ్బతింటుందని తోసిపుచ్చుతూ వచ్చింది. భాషా ప్రయోక్త రాష్ట్రాల విషయంలో కూడా ఈ రకమైన అభిప్రాయంతో అప్పటి నెహ్రూ ప్రభుత్వం ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో భాష ప్రయోక్త రాష్ట్రాలు ఏర్పాటు అయ్యాయి. 70 సంవత్సరాల భాష ప్రయోక్త రాష్ట్రాల చరిత్రలు దేశాన్ని విచ్ఛిన్నం చేయగల అనైక్యత ఎక్కడా సంభవించలేదని చెప్పవచ్చు.

అంటే ఒక విషయంపై మనలో చాలా కాలంగా గూడుకట్టుకున్న ఆలోచనలు వాస్తవం కాదని తేలిపోయింది. జనగణనలో కులగణన చేయాలనే డిమాండ్ వచ్చినప్పుడల్లా తోసిపుచ్చిన చరిత్ర కాంగ్రె పార్టీదే.అయినప్పటికీ 2011లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యుపిఎ ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సామాజిక, ఆర్థిక, కులగణన చేయడం జనగణనలో కులగణనకు మొదటిమెట్టుగా చెప్పవచ్చు. ఎన్‌డిఎ ప్రభుత్వం జనగణనలో కులగణనను వ్యతిరేకించినప్పటికీ ప్రస్తుతం నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ పరిణామం. అయితే ఈ ఘనత మాత్రం దేశవ్యాప్తంగా ఈ వాదాన్ని చర్చకు తెచ్చిన కాంగ్రెస్ పార్టీది, ఆయా రాష్ట్రాల్లో జనగణనలో కులగణనకై డిమాండ్ చేసిన డిఎంకె, ఎస్‌పి, ఆర్‌జెడి లాంటి ప్రాంతీయ పార్టీలది. కులగణన చేయడమే కాదు, విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బిసిలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో చట్టం చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రానిదే. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కులగణనకు డిమాండ్ చేయడం, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కులగణనకు వాగ్దానం చేయడం, రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించడం, బిసి సంఘాల ఒత్తిడి నేపథ్యంలో కులగణన జరగడం, విద్య, ఉద్యోగ స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల పెంపుకై శాసనసభ చట్టం చేస్తూ కేంద్రానికి పంపడం చకచగా జరిగిపోయాయి.

42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం బిసి సంఘాలు ఢిల్లీలో ‘జంతర్ మంతర్’ వద్ద డిమాండ్ చేయడంతో కులగణనపై కేంద్రం ఆలోచనలో మార్పు వచ్చిండోచ్చు. కర్ణాటక, తెలంగాణ తోపాటు బీహార్ లాంటి రాష్ట్రాలు కులగణన పూర్తి చేయడం దేశంలో చాలా రాష్ట్రాల్లో కులగణనకై డిమాండ్లు వినిపించడంతో ఒక్కసారిగా కేంద్రం పునరాలోచనలోపడి ఉండవచ్చు. బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో చివరి ఉపన్యాసంలో మాట్లాడిన మాటలు కూడా కేంద్ర ప్రభుత్వంపై ప్రభావాన్ని చూపి ఉండవచ్చు. ‘ఒక వ్యక్తికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒక విలువ ద్వారా 26 జనవరి 1950 నుంచి మనం రాజకీయ సమానత్వంలోకి అడుగు పెట్టబోతున్నాం. కానీ కొన్ని వందల సంవత్సరాలుగా మన దేశంలో ఉన్న ఆచార, సంప్రదాయాలు మన సమాజంలో సామాజిక, ఆర్థికంగా సమానత్వం సాధించుటకు ప్రతిబంధకాలుగా ఉన్నాయి. రానున్న ప్రభుత్వాలు ఆ ప్రతిబంధకాలను తొలగిస్తూ సామాజిక, ఆర్థిక సమానత్వానికై ప్రయత్నించాలి.

సామాజిక, ఆర్థిక సమానత్వం సాధించనినాడు పీడిత ప్రజలు ఈ రాజ్యాంగ సభ కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామిక వ్యవస్థను కుప్పకూలుస్తారు అని హెచ్చరించారు. ఈ 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మెజారిటీ వర్గాలైన బిపి ప్రజలకు విద్య, ఉద్యోగ, రాజకీయ సామాజిక, ఆర్థిక రంగాల్లో సమానత్వం చేకూర లేదనే చెప్పవచ్చు. ఒక వ్యక్తి ఒక ఓటు, ఒక ఓటుకు ఒక విలువ ద్వారా రాజకీయ సమానత్వం ఉన్నట్లు కనబడిన, ఆర్థిక అసమానతలు, ఓటు హక్కును నిజాయితీగా ఉపయోగించుకోలేని పరిస్థితుల వల్ల అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం గల రాజకీయ సమానత్వం ఇప్పటికీ సాధ్యం కాలేదు. దీనికి తోడు రాత్రికి రాత్రి ఇడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిన కేంద్రంపై దేశవ్యాప్తంగా బిసిలందరూ అసంతృప్తితో ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ తగ్గడం, రానున్న బీహార్, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో జనగణనలో కులగణననే ప్రధాన ప్రచారాంశంగా ఉండడంతో కేంద్రం ఆలోచన మారి ఉండవచ్చు.

సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం సాధించాలంటే దేశవ్యాప్తంగా డిమాండ్‌గా వస్తున్న జనగణనలో కులగణన ఒక్కడే పరిష్కార మార్గంగా కేంద్రం భావించి ఉండవచ్చు. జనగణనలో కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతించాల్సిందే. అయితే ఇల్లు అలుకగానే పండుగా కాదన్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంబడి సంబరపడిపోకూడదు. రానున్న జనగణనలో కులగణనకై కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న మార్గదర్శకాలను బిసి సమాజం నిశితంగా గమనించాలి. జనగణనలో కులగణన చేస్తే సరిపోదు. కులగణన రిపోర్టు కనుగుణంగా మండల కమిషన్ సూచించిన 40 సిఫారసులను అమలు చేయాలి. సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య, ఉద్యోగ రంగాల్లో సమానత్వం సాధించే దిశగా తగిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే జనగణనలో కులగణన చేపట్టినదానికి సార్ధకత చేకూరుతుంది. రాజ్యాంగ సభలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశించిన రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం సాధించబడుతుంది.

  • జుర్రు నారాయణ యాదవ్, 94940 19270
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News