పాక్ కవ్వింపులతో విషాదం
శ్రీనగర్ : సరిహద్దులో పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. దీంతో పలువురు సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నపిల్లలు మృతి చెందడంపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మోహబూబా ముఫ్తీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యారు. “ కళ్లముందే ఆటలాడిన కవలలు అంతలోనే రక్తపు మడుగులో కనిపించారు. ఇలా ఎదురుకాల్పుల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు , మహిళలు చేసిన తప్పేంటి ? ఇది ఎక్కడివరకు వెళ్తుంది. జమ్ముకశ్మీర్ ప్రజలు మరీ ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల వారు ఇంకా ఎంతకాలం బాధపడాలి. ? తల్లులకు ఎంతకాలం ఈ కడుపుకోత ? అని ప్రశ్నించారు.
అలా మాట్లాడుతూ ఆమె కంటతడిపెట్టారు. ఆపరేషన్ సిందూర్‌తో దిక్కుతోచని పాకిస్థాన్, సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. కుప్వారా, బారాముల్లా, ఉరీ, పూంఛ్, మెంథార్, రాజౌరీ సెక్టార్లలో మోర్టార్లు, శక్తివంతమైన శతఘ్నులతో కాల్పులకు తెగబడింది. దీంతో బుధ, గురువారాల్లో 16 మంది మరణించారు. అందులో ఐదుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. పూంఛ్ సెక్టారులో చనిపోయిన వారిలో లాన్స్‌నాయక్ దినేశ్ కుమార్ (32) ఉన్నారు. ఆయన హర్యాణాకు చెందిన వారు. గురువారం అర్ధరాత్రి దాడిన తరువాత పూంచ్ ,రాజౌరీ, జమ్ములో మరోసారి పాక్ కాల్పులు, షెల్లింగ్ జరిపింది. క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను మనదేశం పైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్ము, కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్‌ల పైకి వాటిని వదిలింది. వాటన్నింటినీ మనసైన్యం చిత్తు చేసింది.